మహాభారతం నాటి దివ్యాస్త్రాలు ఎలా అంతరించిపోయాయో తెలుసా..?

Chakravarthi Kalyan
మహాభారతం.. భారత హిందూ వాజ్ఞ్మయంలో ఓ అపురూప సాహిత్యం. ఈ ఉద్గ్రంధంలో ఎన్నో మార్మిక రహస్యాలు దాగి ఉన్నాయి. మహాభారత సమయంలో యుద్ధంలో ఎన్నో దివ్య అస్త్రాలు ఒకరిపై మరొకరు ప్రయోగించుకున్నట్టు స్పష్టంగా రాసి ఉంది. అంటే దాదాపు వేల సంవత్సరాల నాడే ఆ ఆయుధాలు, దివ్యాస్త్రాలు ఉన్నాయని మహాభారతం చెబుతోంది. మరి అలాంటి దివ్యాస్త్రాలు ఇప్పుడు లేవెందుకు.. అవి ఆ మహాభారత యుద్ధ సమయంతోనే ఎలా అంతరించి పోయాయి. ?


ఇందుకు సమాధానంగా ఓ కథ ఉంది. మహాభారత కాలం తర్వాత కలియుగం ప్రారంభ సమయంలో ఈ దివ్యాస్త్రాల గురించి తెలిసినవాడు వృషకేతు. ఇతడు కర్ణుడి చిన్నకొడుకు. కురుక్షేత్రం మొదలయ్యే నాటికి వృషకేతు చిన్నవాడు కావడంతో కర్ణుడు ఇతన్ని యుద్ధానికి తీసుకెళ్లలేదు. అలా వృషకేతు బతికిపోయాడు. యుద్ధంలో కర్ణుని చావు తర్వాత పాండవులు వృషకేతును ఆదరిస్తారు. అప్పుడే అర్జునుడు వృషకేతుకు అన్ని యుద్ధవిద్యలు దగ్గరుండి నేర్పిస్తాడు. అన్నిరకాల దివ్యాస్త్రాల జ్ఞానాన్ని బోధిస్తాడు.


అయితే అసలే వచ్చేది కలియుగం అందువల్ల.. ఈ దివ్యాస్త్రాలు దుర్వినియోగం అవుతాయని కృష్ణుడు కలత చెందాడు. వృషకేతు దగ్గరకు ఒంటరిగా వెళ్లి ఓ వాగ్దానం అడుగుతాడు.  దివ్యాస్త్రాలు కేవలం  ఆత్మరక్షణ కోసం తప్ప ఇంకెందుకూ వినియోగించొద్దని ఒట్టు వేయించు కుంటాడు. ఆ తర్వాత వృషకేతుపైకి ఎవరూ యుద్ధానికి రాలేదు. అతడు దివ్యాస్త్రాలను ప్రయోగించే అవకాశమే రాలేదు. ఆ తర్వాత అతడు తన వారసులకు ఆ అస్త్రాల గురించి చెప్పలేదు. అలా ఆ దివ్యాస్త్రాల పరిజ్ఞానం కాల గర్భంలో కలిసిపోయింది.


ఇదీ ఓ జానపద కత. నిజం కావచ్చు. కాకపోవచ్చు. కానీ.. అసలు దివ్యాస్త్రాలు నిజంగా ఉన్నాయా.. మహా భారతంలో రాసిందంతా నిజమేనా.. వరుణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటివి నిజంగా ఉన్నాయా.. కల్పితాలా.. ఉంటే.. వాటి పునర్‌ సృష్టించడం సాధ్యమేనా.. ఇలాంటి ప్రశ్నలు ఎప్పుడూ బుద్ధి జీవులను వేటాడుతూనే ఉంటాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: