తీన్మార్ మల్లన్నకు బీజేపీ నాగార్జున సాగర్ టికెట్ ఆఫర్..?
అలాంటి తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు బీజేపీ బంపర్ ఆఫర్ ఇవ్వబోతోందన్న టాక్ వినిపిస్తుంది. తీన్మార్ మల్లన్నకు నాగార్జున సాగర్ టికెట్ ఆఫర్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే నాగార్జున సాగర్ ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చేసింది. కాంగ్రెస్ ఇప్పటికే తన అభ్యర్థిగా జానారెడ్డిని ప్రకటించేసింది. ఇక టీఆర్ఎస్ దివంగత నోముల నర్సింహయ్య కుమారుడే టికెట్ ఇచ్చే ఆలోచన చేస్తోంది. కానీ బీజేపీకి మాత్రం అక్కడ సరైన అభ్యర్థి లేడు. అంతే కాదు.. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలను కొనసాగించాలంటే సాగర్లో ఓ బలమైన అభ్యర్థి అవసరం.
అందుకే బీజేపీ తీన్మార్ మల్లన్నకు సాగర్ టికెట్ ఆఫర్ చేస్తోందని చెబుతున్నారు. ఏ అండా లేకపోయినా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్లలో సత్తా చాటిన తీన్మార్ మల్లన్న ఇప్పుడు బీజేపీ వంటి పార్టీ అండతో పోటీ చేస్తే సాగర్ ఉపఎన్నిక తప్పకుండా గెలుస్తాడన్న అంచనాలు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న.. ఒక సాధారణ మధ్యతరగతి మనిషి. ఓ సత్తా ఉన్న జర్నలిస్టు.. దమ్మూ ధైర్యం ఉన్న యువకుడు. తాను నమ్మినదాన్ని బలంగా వినిపించే పాత్రికేయుడు. ప్రభుత్వానికి సైతం తలవంచకుండా ఏకిపారేసే నిఖార్సైన జర్నలిస్టు.. ఇప్పుడు ఆ ధైర్యమే తీన్మార్ మల్లన్నకు ఓట్లు కురిపించింది.
ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసినా అధికార పార్టీ అభ్యర్థికి దడ పుట్టించేలా ఓట్లు సంపాదించాడు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలో తీన్మార్ మల్లన్న ఓడిపోయినా తనకు మంచి ఫ్యూచర్ ఉందన్నది ఇప్పడు విశ్లేషకులు చెబుతున్న మాట.