ఎంపీ ఉప ఎన్నిక ప్రచారానికి ఇలాంటి కమిటీనా...? హవ్వా...?

VAMSI
మన భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి మరియు రాజకీయాలు ఉన్నప్పటి నుండి మొట్టమొదటిగా జాతీయ పార్టీగా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. దాని తరువాత సిపిఎం మరియు సిపిఐ పార్టీలు ఉండేవి. ఆ తరువాత 1980 సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించింది. ఈ పార్టీ అంతకు ముందు వరకు జనసంఘ్ గా ఉండేది. కాలక్రమేణా సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ వాది పార్టీలు జాతీయ పార్టీలుగా వచ్చాయి. ఈ ఆరు పార్టీలు మాత్రమే జాతీయ పార్టీలుగా ఉన్నాయి. మిగిలిన పార్టీలన్నీ కూడా ప్రాంతీయ పార్టీల కిందకు వస్తాయి. మాములుగా జాతీయ పార్టీల సిద్ధాంతం లేదా నియమాల ప్రకారం దేశంలో ఎక్కడైనా ఎన్నికలు జరుగుతున్నప్పుడు, జాతీయ పార్టీ ఒక కమిటీ వేసుకుని ఆ ఎన్నికల గురించి ప్రణాళికలు రచించుకోవాలి. ఆ తరువాత జాతీయ స్థాయి నాయకులంతా కూడా ఆ నియోజకవర్గం కావొచ్చు లేదా ఎన్నికలు జరిగే రాష్ట్రము కావొచ్చు...అక్కడ పర్యటించి పార్టీ గెలుపు కోసం ప్రచారం చేయాల్సిన కనీస బాధ్యత ఉంటుంది.

కాగా ప్రస్తుతం ఏపీలోని తిరుపతి పార్లమెంట్ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్న విషయం తెలిసిందే. దీని కోసం అన్ని పార్టీల నాయకులు వచ్చి వారి వారి పార్టీల గెలుపుకోసం ప్రచారాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే జాతీయ పార్టీ కాంగ్రెస్ కూడా ఒక కమిటీని వేసింది. ఇక్కడ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న చింతామోహన్ తరపున ప్రచారం చేసేందుకు ఏపీసీసీ సమన్వయ కమిటీ సభ్యురాలు సుంకర పద్మ మరియు ఇంకొక 13 మందితో కూడిన బృందం ప్రచారం చేయబోతున్నట్లు తెలిసింది. ఆ 13 మందిలో ఉన్న సభ్యులు వీరే. వారిలో తిరుపతి నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు కిదాంబి ప్రమీలమ్మ, నెల్లూరు డీసీసీ అధ్యక్షుడు దేవకుమార్, చిత్తూరు డీసీసీ అధ్యక్షుడు సురేష్ బాబు, ఏపీ పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ రెడ్డి, చిత్తూరు కాంగ్రెస్ కమిటీ ప్రెసిడెంట్ తుకారాం, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ రెడ్డి, ఎన్ ఎస్ వై రాష్ట్ర అధ్యక్షుడు నాగ మధు యాదవ్, సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ ఇంచార్జి పెనుబాల చంద్రశేఖర్, జి చిట్టిబాబు, వెంకట నరసింహులు, యర్లపల్లి గోపి మరియు మాగంటి గోపాల్ రెడ్డి ఉన్నారు.

వీరంతా ప్రజలకు బొత్తిగా పరిచయం లేని వారు. ఇలాంటి వారిని ప్రచారానికి పంపడంలో కాంగ్రెస్ కి పెద్దగా ఉపయోగం ఉండబోదని పలువురు నాయకులు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న పెద్ద నాయకులను పిలిచి ఉంటే ఉపయోగం ఉండేది. తెలంగాణలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి మరియు వీ హనుమంత్ రావు లాంటి వాళ్ళను పిలవాల్సి ఉంది. తిరుపతి ఎంపీ చరిత్ర చూసుకుంటే కాంగ్రెస్ పార్టీనే గెలుస్తూ వస్తోంది. అలాంటప్పుడు ఇటువంటి కమిటీని వేయడంలో అర్ధమేమిటో తెలియడం లేదు. జాతీయ స్థాయి పార్టీ ఇలా ఆలోచిస్తోందా...? లేదా జాతీయ స్థాయి నాయకులతో...రాష్ట్ర స్థాయి  నాయకులకు సమన్వయము లోపించిందా...? అని పలు సందేహాలు తలెత్తుతున్నాయి. వీటన్నింటినీ పరిశీలించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.    
ఎంపీ ఉప ఎన్నిక ప్రచారానికి ఇలాంటి కమిటీనా...? హవ్వా...?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: