గురుమూర్తిపై అనర్హత? తిరుపతి ఎన్నికలో ట్విస్ట్!

SRISHIVA
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కాక రేపుతోంది. ఉపఎన్నికను సవాల్ గా తీసుకున్న ప్రధాన పార్టీలు చివరి నిమిషం వరకు హోరాహోరీగా పోరాడాయి. అధికార పార్టీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి గెలుపు కోసం వైసీపీ మంత్రులు జోరుగా ప్రచారం చేశారు. నియోజకవర్గానికో మంత్రిని సీఎం జగన్ ఇంచార్జ్ గా నియమించడంతో వారంతా ప్రతి గ్రామాన్ని చుట్టేశారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డైరెక్షన్ లో వైసీపీ ప్రచారమంతా సాగింది. టీడీపీ అభ్యర్థి పనబాక లక్ష్మి కోసం టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నారా లోకేష్ సుడిగాలిలా ప్రచారం చేశారు. రోడు షోల్లో జగన్ సర్కార్పై విరుచుకుపడ్డారు టీడీపీ నేతలు. బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి రత్నప్రభను గెలిపించేందుకు ఆ రెండు పార్టీలు శ్రమించాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ప్రచారం చేశారు.
అయితే తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ కు కొన్ని గంటల ముందు ట్విస్ట్ నెలకొంది. ఉప ఎన్నికలో వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఏపీ బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. వర్చువల్ విధానంలో వారు తమ ఫిర్యాదును సీఈసీకి నివేదించారు. తిరుపతి బరిలో పోలింగ్ భద్రత, తదితర అంశాలపై వారు ఆందోళన వ్యక్తం చేశారు. వాలంటీర్లను రాజకీయ లబ్దికి వినియోగిస్తున్నారని బీజేపీ బృందం తన ఫిర్యాదులో పేర్కొంది.
అంతేకాదు వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి పోటీకి అనర్హుడని సీఈసీకి ఫిర్యాదు చేశారు ఏపీ బీజేపీ నేతలు. గురుమూర్తి అన్యమతానికి చెందిన వ్యక్తి అనేందుకు తగిన ఆధారాలను అందజేశారు. రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు స్పందిస్తూ...గురుమూర్తి అనర్హత అంశంపై విచారణ జరపాలని సీఈసీని కోరామని  తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరామని అన్నారు. తిరుపతిలో ఈ నెల 17న ఉప ఎన్నిక పోలింగ్ జరగనుండగా.. రెండు రోజుల ముందు వైసీపీ అభ్యర్థిపై బీజేపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడం కలకలం రేపుతోంది. ఏకంగా పోటీకి గురుమూర్తి అనర్హుడని బీజేపీ ఆరోపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది. బీజేపీ ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం ఎలా స్పందిస్తున్నది ఆసక్తి రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: