ఇలా చేస్తే మృతదేహాల ద్వారా కరోనా వ్యాప్తి తక్కువే..?

Suma Kallamadi
కరోనా వల్ల చాలా మంది చనిపోతున్నారు. చనిపోయినవారి వద్దకు ఎవ్వరూ రావడం లేదు. ఎక్కడ కరోనా సోకుతుందేమోననే భయం వారిని దూరంగా ఉంచేస్తోంది. అయితే ఎవరైనా కోవిడ్‌ రోగి చనిపోతే వైద్యులు ఆస్పత్రిలోనే మృతదేహాన్ని సోడియం హైపోక్లోరైడ్‌తో శుభ్రం చేసి, శానిటైజర్‌లో తడిపిన వస్త్రాన్ని చుట్టి బంధువులకు అప్పగిస్తున్నారు. ప్లూయిడ్స్‌ బయటికి రాకుండా మృతదేహాన్ని జిప్‌లాక్‌ బ్యాగ్‌లో కేవలం ముఖం మాత్రమే కనిపించేలా ప్యాక్‌ చేసి ఇస్తున్నారు. ఇలాంటి మృతదేహాలకు గౌరవప్రదంగా దహన సంస్కారాలు చేయవచ్చు. కానీ చాలా మంది వైరస్‌కు భయపడి మృతదేహం దగ్గరికే రావడం లేదు. ఆస్పత్రుల్లోనే అనాథ శవాల్లా వదిలివెళ్లిపోతున్నారు. కరోనా మృతదేహాలకు అంత్యక్రియల విషయంలో ఆందోళన కనిపిస్తోంది. మృతదేహాల దగ్గరికి వచ్చేందుకు కుటుంబ సభ్యులు కూడా సాహసించడం లేదు. కొందరు ఆస్పత్రుల్లోనే మృతదేహాలను వదిలేసి వెళుతున్నారు. అలాంటి వాటికి మున్సిపాలిటీలే అనాథ శవాల జాబితాలో దహన సంస్కారాలు నిర్వహిస్తున్నాయి.
నిజానికి కోవిడ్‌ మృతదేహాల విషయంలో ఇంత భయం అవసరం లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూ అంత్యక్రియలు నిర్వహించవచ్చని తెలియజేస్తున్నారు. ప్రాణం పోయిన తర్వాత శరీరంలో వైరస్‌ ఉత్పత్తి ఆగిపోతుంది. అప్పటికే బాడీలోని ప్లూయిడ్స్‌లో వైరస్‌ ఉన్నా దానికది ఇతర ప్రదేశాలకు వ్యాపించలేదు. ఆ మృతదేహాన్ని నేరుగా తాకడం, పైన పడి ఏడవడం, చనిపోయినవారి తల, ఇతర శరీర భాగాలను ఒళ్లో పెట్టుకుని ఏడవడం వంటివాటి వల్ల మాత్రమే వైరస్‌ విస్తరించే అవకాశం ఉందని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు. కరోనా మృతదేహాన్ని ఉంచిన జిప్‌బ్యాగ్‌ను తెరవకుండా ఉంటే వైరస్‌ సోకే అవకాశం లేనట్టేనని అంటున్నారు. మృతదేహాల నుంచి ఇతరులకు వైరస్‌ సోకిన దాఖలాలు లేవని అప్పటికే వైరస్‌ సోకి, లక్షణాలు లేనివారు గుంపుగా ఉన్న జనంలో కలిసి దహన సంస్కారాల్లో పాల్గొనడం వల్లే వైరస్‌ విస్తరిస్తోందని చెప్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: