ఇండియాపై దుష్ప్రచారం.. భారత్‌ స్ట్రెయిన్ బూటకం..?

Chakravarthi Kalyan
మన దేశం కరోనా సెకండ్ వేవ్‌ కోరల్లో చిక్కిన సంగతి తెలిసిందే. అయితే ఇదే అవకాశంగా మన దేశంపై దుష్ప్రచారం చేసే కుట్ర జరుగుతోందా.. మన దేశ ప్రతిష్టను మంటగలిపేందుకు దీన్ని కొందరు ఉపయోగించుకుంటున్నారా.. లేక మీడియా అనవసరమైన ప్రచారంతో మన పేరు మనమే చెడగొట్టుకుంటున్నామా.. అన్న అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే.. ఇప్పటికే భారత్ రకం వైరస్ 60 వరకూ దేశాల్లో వ్యాపించిందంటూ వార్తలు వస్తున్నాయి. ఈ విషయం  ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ చెప్పిందంటూ ఈ వార్తలు వస్తున్నాయి.

కానీ అసలు విషయం పూర్తిగా వేరనేట. ఎందుకంటే.. బి.1.617.. భారత్‌ రకం స్ట్రెయిన్‌ అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ ఎక్కడా చెప్పనేలేదట. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌ఓ చెప్పకపోయినా మీడియా సంస్థలే అలా వాడుతున్నాయని కేంద్రం అంటోంది. భారత రకం కరోనా వైరస్‌ ప్రపంచానికి ఆందోళనకరమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పినట్లు వార్తలు వచ్చిన నేపథ్యంలో కేంద్రం వాటిని తీవ్రంగా ఖండించింది.

ఈ విషయంపై కేంద్రం ఓ ప్రకటనలో క్లారిటీ ఇచ్చింది. ‘బి.1.617 వైరస్‌ స్ట్రెయిన్‌ ఆందోళనకర రకంగా డబ్ల్యూహెచ్‌ఓ వర్గీకరించినట్లు చాలా మీడియాల్లో కథనాలు వచ్చాయని.. అయితే ఈ కథనాల్లో బి.1.617ను ‘భారత వేరియంట్‌’ అని పేర్కొన్నారని.. ఆ వార్తలు నిరాధారం, అవాస్తవం అని కేంద్రం చెబుతోంది.  బి.1.617ను భారత రకం స్ట్రెయిన్‌ అని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పలేదని..  కరోనా వైరస్‌ల విషయంలో డబ్ల్యూహెచ్‌వో 32 పేజీల నివేదిక ఇచ్చినా  అందులో ఎక్కడా ‘భారత్‌’ అనే పదం లేదని కేంద్రం వివరణ ఇచ్చింది.  
ఈ వివాదానికి మూలం డబ్ల్యూహెచ్‌ఓ కొవిడ్‌ విభాగ సాంకేతిక నిపుణురాలు డా. మరియా వాన్‌ కేర్‌ఖోవ్‌ గత సోమవారం వెల్లడించిన ఓ నివేదిక. అందులో బి.1.6.17 స్ట్రెయిన్‌ ఆందోళనకరమని ఉంది. భారత్‌లో వెలుగుచూసిన ఈ వైరస్‌ వ్యాప్తి తీవ్రత గురించి తమకు అవగాహన ఉందని, దీనిపై అధ్యయనాలను పరిశీలిస్తున్నామని ఆమె అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: