చాపకింద నీరులా "బ్లాక్ ఫంగస్" ... తెనాలిలో కలకలం ?
కరోనా ఉన్న సమయంలో ఐసీయూలో ఉండడం మరియు ఎక్కువ స్టెరాయిడ్స్ ను వాడడం వలన వీరిలో రోగ నిరోధక శక్తి తగ్గిపోయి బ్లాక్ ఫంగస్ కబళిస్తోంది. ఇప్పుడు తాజాగా గుంటూరు జిల్లాలోని తెనాలిలో రెండు కేసులు రిజిస్టర్ కావడం మరింత ఆందోళన రేకెత్తిస్తోంది. తెనాలిలోని సుల్తానాబాద్ లోని దంపతులకు బ్లాక్ ఫంగస్ సోకినట్లు వైద్యులు గుర్తించారు. కాగా వీరిద్దరూ కొద్ది రోజుల క్రితమే కరోనాతో పోరాడి గెలిచారు. ఇంతలోనే బ్లాక్ ఫంగస్ రూపంలో మరొక శత్రువు వారిని పట్టుకుంది. వీరికి బ్లాక్ ఫంగస్ కళ్ళకు రావడం జరిగింది. దీనితో రెండు రోజుల నుండి వీరిద్దరూ హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నారు. వీరిని ట్రీట్ చేసిన గుంటూరు డాక్టర్స్ మెరుగైన చికిత్స కోసం విశాఖపట్నం వెళ్లాలని చెప్పినట్లుగా తెలుస్తోంది.
ఇలా ఒకటి పోతే మరొకటి మానవ మనుగడను ప్రభావితం చేస్తున్నాయి. ఇలా రోజూ ఏదో ఒక విధంగా రాష్ట్ర ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తోంది. దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్లాక్ ఫంగస్ కోసం తీసుకునే చికిత్సను ఆరోగ్య శ్రీ కింద వర్తించే విధముగా ఈ రోజు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ బ్లాక్ ఫంగస్ కు యాంటీ ఫంగల్ చికిత్స చేస్తే త్వరగా కోలుకోవచ్చని తెలుస్తోంది. ప్రాణాపాయం ఉన్న వారిని యాఫోటెరిసన్ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్ ఇంజెక్షన్లను ఇచ్చి కాపాడొచ్చని చెబుతున్నారు. కానీ ఈ ఇంజక్షన్ కోసం ఒక రోజుకి 9000 రూపాయలు ఖర్చు చేయాలి. మూడు వారాలపాటు ఈ ఇంజక్షన్ ఇవ్వాలి. అప్పుడు వారికి ప్రాణాపాయం తప్పుతుంది.