కరోనా టైంలో సొంత వైద్యం..ప్రాణాలకు ముప్పేనా?

Suma Kallamadi
కరోనా టైంలో చాలా మంది తమ సొంత వైద్యాన్ని అనుసరిస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఏ మందు అయినా అవసరం మేరకే వాడాలి అంతేగానీ విచ్చలవిడిగా వాడి లేనిపోని ఇబ్బందులను కొని తెచ్చుకుంటున్నారు. సొంత వైద్యం ప్రాణాలకే ముప్పని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అనవసరంగా మందులు వాడటం ద్వారా శరీరంలో డ్రగ్‌ రెసిస్టెన్స్‌ పెరిగి అవసరమైనప్పుడు ఆ మందులు పనిచేయకుండా పోతాయని చెబుతున్నారు. మొదటి వేవ్‌ సమయంలో హైడ్రాక్సీ క్లోరోక్వీన్, మీజిల్స్‌-రూబెల్లా వ్యాక్సిన్, పర్‌మెక్టిన్, హెచ్‌ఐవీ బాధితులకు వాడే లోపినావీర్‌ 50, రిటోనావీర్‌200 వంటి మందులను వైద్యరంగానికి చెందిన వారు సైతం వాడారు. అప్పట్లో వ్యాక్సిన్‌ లేరు కాబట్టి ముందస్తుగా వాడారు. కానీ నేడు వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ కొందరు వాటిని వాడుతున్నారు. ఇక నాళాల్లో బ్లాక్స్‌కు అస్పిరిన్‌ వాడితే సరిపోతుందని సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుండటంతో ఎక్కువ మంది ఆస్పిరిన్, ఎకోస్ప్రిన్‌ మందులను వాడేస్తున్నారు. వాటితోపాటు వైరల్‌ జ్వరాలు వచ్చినప్పుడు వాడే ఫాబి ఫ్లూ మందులను ఎక్కువగా వాడుతున్నారు. ఇక విటమిన్‌ సీ, డీ, జింక్‌ మందులను రెగ్యులర్‌గా వేసే వాళ్లున్నారు.

కరోనా పాజిటివ్‌ వచ్చిన రోగికి వైద్యులు రాసిన మందులను తమ స్నేహితులు, సన్నిహితులకు పాజిటివ్‌ వచ్చినప్పుడు వైద్యుల సూచన లేకుండానే వాడేస్తున్నారు. వాట్సాప్‌ ద్వారా ఆ మందుల వివరాలు తీసుకొని మందుల షాపుల్లో కొనుగోలు చేసి వాడుతున్నారు. వాస్తవంగా వ్యక్తి ఆరోగ్య స్థితి, దీర్ఘకాలిక వ్యాధులు వంటి వాటిని పరిగణలోకి తీసుకొని మందులు వాడాల్సి ఉంది. అలాకాకుండా మధుమేహం ఉన్నవారు సైతం స్టెరాయిడ్స్‌ వాడుతుండటంతో వారి పరిస్థితి విషమిస్తోంది. అంతేకాకుడా కొన్ని రకాల మందులతో డ్రగ్‌ ఎలర్జీలకు సైతం గురవుతున్నారు. యాంటీ వైరల్‌ డ్రగ్‌ను వైరస్‌ సోకినప్పుడు మాత్రమే వాడాలని వైద్యులు చెబుతున్నారు. లేకుంటే వెయిట్‌ లాస్, ఆకలి మందగించడం వంటి సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: