జగన్ సారూ వారి ఆత్మహత్యలు ఆపండి ?

VAMSI
భారతదేశంలో ఉన్న వెనుకబడిన వర్గాల ప్రజలను ఆధారంగా చేసుకుని కరువు కాలంలో వారికి ఆర్ధికంగా భరోసా కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఒక కార్యక్రమమే "జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకం". ఈ పధకం వలన గ్రామంలోని అర్హులైన ప్రతి ఒక్క సభ్యుడు సంవత్సరానికి వందరోజులు పని చేసే హక్కును పొందుతారు. ఈ వంద రోజులకుగానూ వారి ఊరి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటారు. ఉదాహరణకు, చెరువులు తవ్వుకోవడం, నీటి కాలువలు తవ్వుకోవడం , ఇంకుడు గుంతలు కొట్టడం, తోటల పెంపకం వంటి వివిధ రకాల పనులను చేసుకుంటూ ఉంటారు. ఈ పనులు చేసినందుకు ఒక్క రోజుకు కూలీ రూ. 150 నుండి రూ. 200 వరకు వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా బాగానే ఉన్నా, ఈ పధకంలో భాగంగా ఆయా ప్రాజెక్టులను కాంట్రాక్టర్లు తీసుకుని పనులను చేయిస్తూ ఉంటారు.

కానీ ఇప్పుడు సమస్య ఏమిటంటే 2018-19 సంవత్సరానికి సంబంధించి ఎన్ఆర్ఇజిఎస్ నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించలేదని తెలుస్తోంది. పనులు చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా చిన్న కాంట్రాక్టర్లను ఆంధ్రప్రదేశ్ లో ఇంకా వేధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ పధకానికి సంబంధించి బిల్లులు చెల్లించకపోవడంతో వారిని అడిగి అడిగి విసిగి వేసారిపోయి నలుగురు చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇక నైనా ప్రభుత్వం కల్పించుకుని మిగిలిన వారికి ఆగిపోయిన బిల్లుల డబ్బులను చెల్లించకపోతే వారు కూడా ఆత్మహత్య దిశగా వెళ్లే ప్రమాదం ఉందని తెలుస్తోంది. కాంట్రాక్టర్లు ఆ పనులు చేయించడానికి, బయట అప్పులు తెచ్చి పెట్టుబడిగా పెట్టుంటారు.

కానీ సదరు అప్పు ఇచ్చిన వారు ఇంటి దగ్గరకు వచ్చి తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని తమ గోడును విన్నవించుకున్నారు. ఇప్పుడిప్పుడు చేస్తున్న పనులకు కూడా బిల్లులు చెల్లిస్తున్నారని, కానీ పాత బిల్లులు మాత్రం ఇవ్వడం లేదని వాపోతున్నారు. ఇలాంటి వాటిపై అప్పట్లో సోషల్ ఆడిట్ కూడా జరిగింది. కానీ ఈ ఆడిట్ లు స్థానికంగా జరిగాయి. ఈ ఆడిట్ రిపోర్ట్ ప్రకారం కాంట్రాక్టర్లు పని చేయకుండా ఉంటే, వారికి డబ్బులివ్వకపోవడంలో తప్పు లేదు. కానీ పనులు చేసి కూడా బిల్లులు ఇవ్వకపోతే అన్యాయమని భావించాలి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం చొరవ తీసుకుని, రాజకీయ కోణంలో చూడకుండా, వారు నిజంగా పనిచేసుంటే డబ్బులు ఇప్పించేలా చూడాలి. మిగిలిన కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకోకుండా కాపాడే బాధ్యత ప్రభుత్వానిది. మరి ఇందులో మార్పులు ఏమైనా జరుగుతాయా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: