ఒక వృద్ధుడి వయస్సు 111 ఏళ్ళు అయినా ఇప్పటికీ చాలా ఆరోగ్యంగా ఉన్నాడు. వింటేనే ఎంతో ఆశ్చర్యంగా ఉంది కదా. ఇన్నేళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉండటానికి, దీర్ఘ ఆయుస్సు పొందటానికి గల రహస్యం ఏంటి అని అడిగితే కోడి మెదడు అంటూ అందర్నీ ఆశ్చర్యపరిచాడు ఆ వృద్ధుడు. ఆస్ట్రేలియా దేశంలోని రోమాకు చెందిన డెక్సటర్ క్రుగర్ అనే వ్యక్తి వయసు ఏకంగా 111 ఏళ్ళు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం అత్యధిక వయసు ఉన్న వ్యక్తి డెక్స్ టర్ క్రుగర్ అని ఆస్ట్రేలియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వ్యవస్థాపకుడు జన్ టేలర్ పేర్కొన్నారు. ఈ మేరకు తాజాగా ఆస్ట్రేలియన్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్ డెక్సటర్ వద్ద ఇంటర్వ్యూ తీసుకోగా తన దీర్ఘ ఆయుష్షుకు సంబంధించిన రహస్యాలను వెల్లడించాడు ఆ వృద్ధుడు.
నేను కోడి మెదడును ఇష్టంగా ఎక్కువగా తింటుంటాను అదే నా ఆరోగ్య రహస్యం. అందుకే ఇంత ఆరోగ్యంగా ఇంత కాలం జీవించి ఉన్నాను అంటూ అందరినీ ఆశ్చర్యపరిచాడు. కోడి మెదడు, కోడి తల భాగంలో చాలా చిన్న పరిమాణంలో ఉంటుందట. అది చాలా రుచిగా కూడా ఉంటుందని చెపుతున్నాడు క్రుగర్. అసలు చాలా మందికి కోడి మెదడు ఎలా ఉంటుందో కూడా తెలియదు. అసలు కోడి తలని కట్ చేసేటప్పుడే ఒక వ్యర్థపదార్థమని విసిరిపారేస్తుంటారు. అలాంటిది కోడి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిదని దీర్ఘ ఆయుష్షు పొందడానికి ఒక అద్భుతమైన మార్గమని తెలిపారు క్రుగర్. ఇక తన జీవితం పై ఓ బయోపిక్ కూడా రాశానని చెప్పారు. అంతేకాక ఈయన జ్ఞాపక శక్తి కూడా చాలా చురుగ్గా ఉందని , అలాగే తన పని తాను చేసుకుంటారని పేర్కొన్నారు క్రుగర్ తనయుడు గ్రెగ్.
ఒకప్పుడు మన ప్రపంచం ఎంతో అందంగానూ పరిశుభ్రంగానూ ఉండేది. కానీ రాను రాను జన సాంద్రత పెరిగింది, టెక్నాలజీ పేరుతో ఎన్నో మార్పులు వచ్చాయి. దాంతో అడవులు కాస్త ఫ్లాట్లు గా , ఫ్యాక్టరీలుగా మారుతున్నాయి. అధిక వాహనాల వినియోగం వలన మన పరిసరాలు కాలుష్యంతో నిండిపోయాయి. తద్వారా మనుషులు అనారోగ్య పాలవుతున్నారు. మనం తీసుకునే ఆహారపు అలవాట్లలో కూడా మార్పు రావడంతో ఇది కూడా ఒకరకంగా మనకు హాని కలిగిస్తోంది. తద్వారా మనుషుల ఆయుష్షు తగ్గుతూ వస్తోంది. ఒకప్పుడు జనాలు 80 ఏళ్ళు 90 ఏళ్లకు మించి ఆరోగ్యంగా జీవించే వారు. అయితే ఇప్పటి కాలంలో అంతటి అదృష్టం నూటికో కోటికో ఒకరికి మాత్రమే దక్కుతోంది మిగిలిన వారు 65 నుండి 70 బ్రతకడమే కష్టంగా తయారవుతోంది. ఇలాంటి ఈరోజుల్లో క్రుగర్ 111 ఏళ్ళు దాటినా ఇంకా ఆరోగ్యంగా జీవిస్తుండడం, దాని వెనకున్న రహస్యం కోడి మెదడు అని క్రుగర్ చెప్పడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది.