కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విజృంభిస్తోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతుండటంతో పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. మృతుల సంఖ్య పెరుగుతుంది. దేశంలోని పలు ప్రాంతాల్లో కొవిడ్ కేసులు ఎక్కువగా వస్తుండంతో వారిని తరలించేందుకు అంబులెన్సులు కూడా సరిపోని పరిస్థితి. దీనికితోడు పలు పట్టణాల్లో ఇరుకు రహదారులు ఉండటం, వాటిల్లోకి అంబులెన్సులు వెళ్లే పరిస్థితి లేకపోవటం కారణంగా కొవిడ్ రోగులు ఆస్పత్రులకు చేరేందుకు ఇబ్బందులు పడుతున్నారు. కొవిడ్‌కు భయపడి ఇతర వాహనదారులు వారిని ఆస్పత్రికి తరలించేందుకు ఇష్టపడటం లేదు. దీంతో కర్ణాటక రాష్ట్రంలోని కలబురగి మున్సిపాలిటీలో వినూత్నం విధానానికి శ్రీకారం చుట్టారు. ఆటో అంబులెన్సులను అందుబాటులోకి తేవడం ద్వారా కొవిడ్ రోగులు ఆస్పత్రులకు వెళ్లేందుకు సహాయం అందిస్తున్నారు.
కోవిడ్-పాజిటివ్ రోగులను ఉచితంగా ఆసుపత్రులకు తీసుకెళ్లడానికి ఆటోరిక్షా అంబులెన్స్‌లను మోహరించిన కర్ణాటకలోని ఏకైక నగరం కలబురగి. ఐదు ఆటో అంబులెన్స్‌లతో కూడిన ఈ సేవ మంగళవారం ప్రారంభమైంది. రోగులు ఎక్కువ నిరీక్షణ లేకుండా ఆసుపత్రులకు చేరేలా చూడటం వీరి లక్ష్యం. ప్రస్తుతం ఐదు ఆటో రిక్షాలు అందుబాటు ఉన్నాయి. మూడు పగటిపూట, రాత్రి పూట రెండు అందుబాటులో ఉంటాయి. బెంగళూరు నుండి 570 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలబురగిలోని నగర మునిసిపల్ కమిషనర్ కార్యాలయంలో వీటిని ఉంచారు. ఇదే విషయంపై కలబురిగి కార్పొరేషన్ కమిషనర్ స్నేహాల్ లోఖండే మాట్లాడుతూ.. నగరంలో దాదాపు 100 అంబులెన్సులు ఉన్నాయని, అయితే చాలా ప్రాంతాలు అంబులెన్సులు పోలేని పరిస్థితి ఉందని ఉందని, ఈ క్రమంలో ఆటోరిక్షాల ద్వారా కొవిడ్ రోగులను తరలిస్తున్నామన్నారు. ఈ సేవను ప్రారంభించిన మంగళవారం రాత్రి ఏడుగురు, బుధవారం 25 మంది ఉపయోగించుకున్నారని ఆయన తెలిపారు.
జిల్లా ప్రతిరోజూ 700 నుంచి 800 కొత్త కొవిడ్ కేసులను నమోదవుతున్నాయని, వాటిలో 400-500 కేసులు నగరాల్లోనే ఉన్నాయని తెలిపారు. వాటిలో 10% కేసులకు మాత్రమే ఆసుపత్రి అవసరం అవుతుందని, నగరంలో చాలా ఇరుకైన దారులు ఉన్నందున, అంబులెన్స్‌ల పోలేని పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. ఈ క్రమంలోనే కొవిడ్ రోగుల ఇబ్బందులను తొలగించేందుకు ఆటో రిక్షాలను అందుబాటులోకి తెచ్చినట్లు లోఖండే పేర్కొన్నారు. ఇదిలాఉంటే ఆటో డ్రైవర్లు ప్రతి ట్రిప్ తర్వాత ఆటోరిక్షాలను శానిటైజ్ చేస్తారు. ఒక్క కొవిడ్ సోకిన వారినే కాకుండా, టీకా తీసుకోవాలనుకున్న వారిని టీకా కేంద్రాలకు తరలిస్తున్నారు. ఓ ఆటో డ్రైవర్ మాట్లాడుతూ.. రోగులు పడే ఇబ్బందులు చూసి తాను కొవిడ్ రోగులను తరలించేందుకు ముందుకొచ్చానని తెలిపాడు. బుధవారం ఐదుగురు కొవిడ్ రోగులను ఆస్పత్రికి తరలించడం జరిగిందని తెలిపాడు. పూర్తిస్థాయిలో రక్షణ కవచాలను ధరించడంతో పాటు, శానిటైజర్ ఉపయోగించడం వంటి జాగ్రత్తలు తీసుకుంటానని పేర్కొన్నాడు. ఈ క్రమంలో స్వచ్ఛందంగా పనిచేసేందుకు ముందుకొచ్చిన ఆటో డ్రైవర్లతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు మున్సిపల్ కమిషనర్ తెలిపారు. వీరికి రోజువారీ భత్యంతో పాటు, ఉచిత ఇంధన సహాయం చేస్తామని లోఖండే తెలిపారు.