24న తేలనున్న కృష్ణపట్నం ఆనందయ్య 'మందు' అసలు సంగతి..?
సోషల్ మీడియాతో పాటు టీవీ మీడియా కూడా ఆనందయ్య వెంట పడటంతో.. చివరకు జనం రద్దీ తట్టుకోలేక మందు పంపిణీ ఆపేయాల్సి వచ్చింది. అయితే ఈ మందుపై వైద్య నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏపీ సీఎం జగన్ నుంచి ఉపరాష్ట్రపతి వెంకయ్య వరకూ ఈ మందు గురించి ఆరా తీశారు. అంతే కాదు.. ఈమందు సంగతేంటో అర్జంటుగా కనుక్కోమని అప్పటికప్పుడు నిపుణులను పంపారు.
కృష్ణపట్నం ఆయుర్వేద మందుపై అధ్యయనం చేయాలని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.. ఆయుష్ ఇన్ ఛార్జ్ మంత్రి కిరణ్ రిజిజు, ఐసీఎంఆర్ డీజీతో మాట్లాడారు. అధ్యయనం చేసి త్వరగా నివేదిక వచ్చేలా చొరవ తీసుకోవాలని కోరారు. ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేద మందుపై శాస్త్రీయ నిర్ధరణ చేయించాలన్న సీఎం జగన్ ఆదేశాలతో... ఆయుష్ కమిషనర్ , అధికారులు కృష్ణపట్నంలో పర్యటించారు. స్థానికులతో మాట్లాడారు. ఆనందయ్య మందు తయారుచేస్తున్న వివిధ చెట్ల ఆకులు, పదార్థాలను పరిశీలించారు. తయారీ విధానాన్ని అడిగి తెలుసుకున్నారు.
అనంతరం రాత్రి కలెక్టర్ చక్రధర్‌బాబుతో బృంద సభ్యులు మాట్లాడారు. ఆయుర్వేద మందుకు సంబంధించిన పరీక్షలు కొన్ని పూర్తి కావాల్సి ఉందన్నారు. అప్పటివరకు పంపిణీ నిలిపేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. కేంద్ర ఆయుర్వేదిక్ పరిశోధనకు చెందిన వైద్యుల బృందం కూడా సోమవారం కృష్ణపట్నం వస్తుందని వైద్యారోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ తెలిపారు. ఐసీఎంఆర్ నివేదిక ఇచ్చిన తర్వాతనే ఆనందయ్య మళ్లీ మందు పంపిణీ చేస్తారని ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్‌రెడ్డి తెలిపారు.