మండలి రద్దు లేనట్లేనా? షరీఫ్ ప్లేస్ ఎవరికి?

M N Amaleswara rao

మూడు రాజధానుల బిల్లు శాసన మండలికి వచ్చినప్పుడు, అక్కడ అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య ఎలాంటి రచ్చ జరిగిందో అందరికీ తెలిసిందే. అసెంబ్లీలో ఫుల్ మెజారిటీ ఉండటంతో మూడు రాజధానుల బిల్లుకు ఆమోదముద్రవేసి జగన్ ప్రభుత్వం మండలికి పంపింది. ఇక ఇక్కడే సీన్ రివర్స్ అయింది. మూడు రాజధానులని వ్యతిరేకిస్తూ, అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించాలని పోరాడుతున్న టీడీపీకి మండలిలో బలం ఉంది. పైగా మండలి ఛైర్మన్ షరీఫ్ టీడీపీకి చెందిన వ్యక్తే.


ఈ క్రమంలో మండలిలో అధికార, ప్రతిపక్షాల మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. పైగా ఏం జరుగుతుందా అనే ఉత్కంఠతో మండలి లాబీల్లో చంద్రబాబుతో పాటు పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు ఓ వైపు ఉంటే, మరోవైపు వైసీపీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ తీవ్ర గంద‌రగోళ ప‌రిస్థితుల మ‌ధ్య షరీఫ్ నాడు బిల్లుల‌ను సెలెక్ట్ క‌మిటీకి పంపారు. ఇక ఇలా మూడు రాజధానుల బిల్లుకు బ్రేక్ పడింది.



ఇంత భారీ మెజారిటీతో అధికారంలో ఉన్న తమ మాట నెగ్గకపోవడంతో జగన్ ఏకంగా మండలి రద్దుకు మొగ్గు చూపారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే ఇప్పుడు ఈ ప్రక్రియ ఎక్కడ ఉందో ఎవరికి తెలియదు. అలా అని కొత్త ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ ఆగడం లేదు. వైసీపీ తరుపున కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు.


ఇదిలా ఉంటే మండలి ఛైర్మన్ షరీఫ్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగుస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా షరీఫ్ సీఎం జగన్, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబులకు కృతజ్ఞతలు తెలిపారు. అయితే షరీఫ్ పదవీకాలం ముగియనుండటంతో నెక్స్ట్ ఛైర్మన్ పీఠంలో ఎవరు కూర్చుంటారనేది ఆసక్తికరంగా మారింది. వైసీపీకి ఎమ్మెల్సీల బలం పెరిగినా, ఇంకా మండలిలో టీడీపీకే మెజారిటీ ఉంది. ఇక నెక్స్ట్ ఎలాంటి రాజకీయాలు జరగకపోతే టీడీపీ నుంచే ఛైర్మన్ ఉంటారని తెలుస్తోంది. చూడాలి మరి షరీఫ్ ప్లేస్ ఎవరు రీప్లేస్ చేస్తారో?


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: