జనసైనికులకు భారీ షాక్...పవన్‌ని అలా చూడటం కష్టమేనా?
పవన్ కల్యాణ్....రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ ఉన్న హీరో. అలాగే రాజకీయాల్లో తనదైన శైలిలో దూసుకెళుతున్న నాయకుడు. ప్రశ్నించడం కోసమని చెప్పి జనసేన పార్టీ పెట్టిన పవన్, 2014 ఎన్నికల్లో టీడీపీ-బీజేపీలకు సపోర్ట్ ఇచ్చి, వారికి అధికారం దక్కడంలో కీలక పాత్ర పోషించారు. అయితే మొదట్లో కాబట్టి తనకు పూర్తి స్థాయిలో గెలిచే బలం లేదని చెప్పి పవన్ ఆ రెండు పార్టీలకు సపోర్ట్ ఇచ్చారు.
అయితే 2014 వదిలేసినా, తర్వాత నుంచి జనసేనని బలోపేతం చేసి, వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం అయిపోతారని జనసేన కార్యకర్తలు, పవన్ అభిమానులు ఆశపడ్డారు. కానీ అభిమానులు అనుకున్న విధంగా పవన్ పార్టీని బలోపేతం చేయలేదు. ఏదో అప్పుడప్పుడు మాత్రమే రాజకీయాల్లో కనిపించారు. తక్కువే కనిపించినా సరే ప్రజల సమస్యల పరిష్కరించడంలో పవన్ బాగా చొరవ చూపారు. అప్పుడు టీడీపీ ప్రభుత్వం సైతం పవన్ ఒక సమస్య గురించి చెబితే, దాన్ని వెంటనే పరిష్కరించేది.
అంతలాగా ప్రభావితం చేసిన పవన్ 2018లో టీడీపీ పొత్తు నుంచి బయటకొచ్చేసి, చంద్రబాబు, టీడీపీ నేతలపై గట్టిగానే విమర్శలు చేశారు. మరోవైపు వైసీపీ, జగన్‌లపై కూడా పవన్ విరుచుకుపడ్డారు. 2019 ఎన్నికల్లో కమ్యూనిస్టులు, బిఎస్పితో పొత్తు పెట్టుకుని ఘోరంగా ఓడిపోయారు. పవన్ సైతం రెండుచోట్ల ఓటమి పాలయ్యారు. ఇక జనసేన ఒక చోట గెలిచింది. అలా గెలిచిన ఎమ్మెల్యే కూడా ఇప్పుడు జగన్ కోసం పనిచేస్తున్నారు.
ఇక ఓడిపోయాక అయినా పవన్ పార్టీని బలోపేతం చేస్తున్నట్లు కనిపించడం లేదు. ఆర్ధికంగా ఇబ్బందులు లేకుండా ఉండటానికి మళ్ళీ సినిమాలు చేస్తున్నారు. ఇక ఎప్పటిలాగానే అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తున్నారు. బీజేపీతో పొత్తు పెట్టుకుని సేఫ్ సైడ్‌లో రాజకీయం చేస్తున్నారు. అయితే పవన్ ఇలా రాజకీయం చేయడం వల్ల, జనసేన స్వతహాగా ఎప్పటికి ఎదుగుతుంది. పవన్ ఎప్పటికి సీఎం అవుతారని జనసైనికులు ఆలోచనలో పడిపోయారు. మొత్తానికైతే పవన్‌కు సీఎం సీటు చాలా దూరంగా ఉందనే చెప్పొచ్చు.