ఆనందయ్య మందు పంపిణీపై హైకోర్టు తేల్చేస్తుందా..?

Deekshitha Reddy
కరోనా నివారణకు ఆనందయ్య ఇస్తున్న ఆయుర్వేదం మందు పంపిణీ వ్యవహారంలో ఓవైపు ఆయుష్ డిపార్ట్ మెంట్, మరోవైపు ఇతర శాఖలు పూర్తి స్థాయిలో పరిశోధనలు జరుపుతున్న వేళ.. మందు పంపిణీ వెంటనే ప్రారంభించాలంటూ కొంతమంది హైకోర్టుని ఆశ్రయించారు. ఇప్పటికే ఆలస్యం అయిందని, ప్రజల ప్రాణాలు పోతున్నాయని, కరోనాతో బాధపడుతున్నవారు మందులేక అల్లాడిపోతున్నారని, వారిని కాపాడాలంటూ.. రెండు హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై రేపు విచారణ జరుగుతుంది.

ఆయుర్వేదం మందు పంపిణీలో గందరగోళం తలెత్తడంతో ముందు జాగ్రత్తగా ప్రభుత్వం పంపిణీని ఆపేసింది. దీనిపై అధ్యయనం చేసేందుకు వివిధ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయి. కేంద్ర సంస్థకు పంపిన నివేదికపై ఫలితాలు వస్తేనే పంపిణీ మొదలు పెడతామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే దాదాపుగా మరో వారం రోజులపాటు మందు పంపిణీ అధికారికంగా మొదలయ్యే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో ఆయుర్వేద మందు పంపిణీ చేసేలా రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్లు దాఖలయ్యాయి. కోర్టు జోక్యంతో మందు పంపిణీ ముందుకు జరిగే అవకాశముందని కొంతమంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

లోకాయుక్త ఆదేశాల ప్రకారం మందు పంపిణీ ఆపేశామంటూ పోలీసులు చెబుతున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. మందు పంపిణీ ఆపాలని అసలు లోకాయుక్త ఆదేశాలు ఇవ్వలేద‌నేది పిటిషనర్ల వాదన. ఏ ఆదేశాలు లేకుండానే మందు పంపిణీ అడ్డుకున్నారని, దానివల్ల కరోనా రోగులు ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చింద‌ని అంటున్నారు. మరోవైపు ఆనందయ్య మందులో ఎలాంటి హానికర పదార్థాలు లేవని తేల్చిన ఆయుష్ శాఖ.. మరింతగా పరిశోధనలు చేస్తున్నామంటోంది. కేంద్ర సంస్థకు నివేదిక పంపామని, వారి సమాధానం కోసం వేచి చూస్తున్నామంటున్నారు అధికారులు. అటు టీటీడీ కూడా ఆనందయ్య ఫార్ములాతో మందు తయారు చేసి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేయడానికి ముందుకొచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తే పనులు మొదలు పెడతామంటున్నారు టీటీడీ అధికారులు. ఈ దశలో ఆనందయ్య మందు వ్యవహారం హైకోర్టుకెక్కడంతో ఎలాంటి పరిణామాలు జరుగుతాయోననే ఆసక్తి పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: