ఐసీయూలోనే ప్రియురాలికి తాళి కట్టిన ప్రియుడు.. చివరకు..?
సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ యువతికి కొన్నేళ్లుగా ఓ యువకుడిని ప్రేమించింది. అతడూ ప్రేమించాడు.. ఇద్దరు త్వరలోనే పెళ్లి చేసుకుని భవిష్యత్ జీవితాన్ని పండించుకోవాలని కలలు కన్నారు. కానీ ఇంతలో కరోనా మహమ్మారి ఆ యువతికి సోకింది. చికిత్స కోసం హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆ యువతిని చేర్చారు. అప్పటి నుంచి ఆ యువతి సోదరుడు, ఆ యువతిని మూడేళ్లుగా ప్రేమిస్తున్న యువకుడు అక్కడే ఉండి.. వైద్య చికిత్స చూసుకుంటున్నారు.
కొన్ని రోజులుగా ఆ యువతి పరిస్థితి క్రమంగా విషమిస్తూ ఉంది. ఈ సమయంలో ఆ యువతికి ధైర్యం ఇచ్చేందుకు.. ఆమె ప్రియుడు ఐసీయూలోనే తాళి కట్టాడు.. నేను నీ భర్తను.. ఎలాగైనా నిన్ను కాపాడుకుంటాను.. నీకేం కాదు.. త్వరలోనే కరోనా నయమైపోతుంది.. మనం మళ్లీ అందరి ముందు పెళ్లి చేసుకుందాం.. ఆనందంగా జీవిద్దాం.. అంటూ ఆ యువతికి జీవితంపై ఆశలు కలిగేలా నమ్మకం, ధైర్యం ఇస్తూ వచ్చాడు.
అయితే అంతగా ఆమె ఆరోగ్యం కోసం తాపత్రయపడినా... చివరకు ఫలితం లేకుండా పోయింది. ఆ యువతిని కరోనా బలి తీసుకుంది. ఈ విషయం ఇంట్లో చెప్పలేక.. ఆ యువతి సోదరుడు, ఆమె ప్రియుడే హైదరాబాద్లోనే అంత్యక్రియలు చేసేశారు. ఆమె బాగయి ఇంటికి వస్తుందని ఆశగా ఎదురు చూసే తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక యువతి సోదరుడు తల్లడిల్లిపోతున్నాడు. తనలో తానే కుమిలిపోతున్నాడు. మరోవైపు.. ఆమెతో జీవితం పంచుకోవాలని ఆశపడి... ఐసీయూలో సైతం తాళి కట్టిన ఆ యువకుడు కూడా మౌనంగా రోదిస్తున్నాడు. కరోనా కల్లోలం చేసిన జీవితాలివి.