ప్రపంచ జీవన శైలిని అడ్డ దిడ్డంగా మార్చేసింది ఈ కరోనా మహమ్మారి. ఈ వైరస్ మానవాళి మనుగడకు పెద్ద అడ్డంకిగా మారి ఎంతటి బీభత్సాన్ని సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే. ఇంకా ఎన్ని రోజులు దీంతో పోరాటం సాగుతుందో తెలియని పరిస్థితి. అయినా ఇది పూర్తిగా ఈ భూమిని విడిచి వెళ్ళేలా అనిపించడం లేదని కొందరు మేధావులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఎన్ని నిబంధనలు పెట్టుకున్నా, ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నా ఒక చిన్న పొరపాటుతో ఈ వైరస్ కాటుకు బలవుతున్నారు. ఇప్పటికే లక్షలాది మంది దీని భారిన పడి తమ ప్రాణాలు సైతం కోల్పోవడం బాధాకరం. ఒక వైపు వ్యాక్సిన్ లు వచ్చి కాస్త ఊరటనిచ్చినా, ఇంకా పూర్తి స్థాయిలో అందరికీ వ్యాక్సినేషన్ జరగలేదు. దేశంలో వ్యాక్సిన్ ల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ఇప్పటికే సన్నాహాలు మొదలుపెట్టారు.
ఈ ఏడాది చివరికల్లా దేశంలో అందరికీ వ్యాక్సిన్ లు అందేలా చూస్తామని కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక పెద్ద వాళ్ళందరికీ అనుకున్నట్లుగా వ్యాక్సిన్ అందినా, మళ్లీ చిన్నారుల సంగతి ఇక్కడ సమస్యాత్మకంగా మారేలా ఉంది. కొన్ని సంస్థలు పిల్లలకు కరోనా వ్యాక్సిన్ లు తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. అయితే చిన్నారులకు వ్యాక్సిన్ లు అందుబాటులోకి వస్తే వారికి అందించి ప్రమాదం నుంచి బయటపడేస్తారు. అయితే ఇక్కడే ఒక పెద్ద సందేహం ప్రజల్లో కలుగుతోంది. ఈ వ్యాక్సిన్ ను ఈ కరోనా పీరియడ్ లో ఇవ్వటమే కాదు. పిల్లల కోసం తయారుచేసే వ్యాక్సిన్ ను ఇక ముందు కూడా కొనసాగించే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు.
వివరాల్లోకి వెళితే సాధారణంగా చిన్న పిల్లలకు పుట్టినప్పటి నుండి కొంత వయసు వచ్చే వరకు కొన్ని రకాల వ్యాధులు సోకకుండా పలు రకాల వ్యాక్సిన్ లు ఇస్తున్న విషయం తెలిసిందే. అయితే వాటితో పాటు కరోనా వ్యాక్సిన్ కూడా ఆ లిస్ట్ లో చేర్చే అవకాశం లేకపోలేదని శాస్త్రవేత్తల అభిప్రాయపడుతున్నారు. కరోనా ప్రభావం ఈ భూమిపై దీర్ఘ కాలం ఉండబోతోంది. కాబట్టి వ్యాక్సిన్ ఒకటే దీనికి మార్గమని భావిస్తున్న వారు భవిష్యత్తులో మన తదుపరి తరం కరోనా భారిన పడకుండా పుట్టగానే ఒక క్రమ పద్ధతిలో అన్ని టీకాలు ఇస్తున్నట్లు కరోనా వ్యాక్సిన్ కూడా ఇస్తారన్న వార్తలు వినబడుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు.