దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ సంక్షోభం దిశ‌గా ప‌య‌నిస్తోందా..?

భార‌తదేశ ఆర్థిక వ్యవస్థపై స‌మ‌గ్ర‌మైన అవగాహ‌న ఉన్న‌ నాయ‌కుల్లో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్‌సింగ్ త‌రువాత చెప్పుకోద‌గ్గ నేత మాజీ ఆర్థిక మంత్రి పి. చిదంబ‌రం. మన్మోహ‌న్‌సింగ్ ప్ర‌ధానిగా ఉన్న స‌మ‌యంలో దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డేందుకు ఆర్థిక‌మంత్రిగా చిదంబ‌రం తీసుకున్న స‌మ‌ర్థ‌వంత‌మైన‌ చ‌ర్య‌లూ కార‌ణ‌మే. కాగా నరేంద్ర‌మోదీ ప్ర‌ధాని అయ్యాక తొలి రెండేళ్లు ఆర్థిక వ్య‌వ‌స్థ ప్ర‌గ‌తి బాట‌లో ప‌రుగులు తీసినా ఆత‌రువాత మంద‌గించింది. నోట్ల ర‌ద్దుతో చిన్న మ‌ధ్య త‌ర‌హా వ్యాపారుల‌కు మొద‌లైన క‌ష్టాలు ఆత‌రువాత జీఎస్టీ అమ‌లుతో మ‌రింత పెర‌గ‌డ‌మే ఇందుకు కార‌ణ‌మ‌ని చెప్పాలి. ఈ కాలంలో వేల సంఖ్య‌లో చిన్నాచిత‌కా ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ్డాయి. ల‌క్ష‌లాదిమంది నిరుద్యోగుల‌య్యారు. దీనికితోడు క‌రోనా మ‌హమ్మారి దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌పై సునామీలా విరుచుకుప‌డి ప్ర‌జాజీవితాన్ని తీవ్ర‌ సంక్షోభంలోకి నెట్టింది.ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం మంగళవారంనాడు ఘాటు విమర్శలు చేశారు. నాలుగు దశాబ్దాల్లో అత్యంత 'చీకటి సంవత్సరంగా 2020-21 నిలుస్తుందని ఆయ‌న అన్నారు. కరోనా మొదటి వేవ్ పతాక స్థాయికి చేరుకున్న అనంతరం 'ఆర్థిక పునరుత్ధానం'‌పై ఆర్థిక శాఖ గత ఏడాది జూలైలో ప్రజలను తప్పుదారి పట్టించిందని కూడా మాజీ ఆర్థిక‌మంత్రి ఆరోపించారు. ఆర్థిక నిపుణుల స‌ల‌హాల‌ను ఏమాత్రం ప‌ట్టించుకోకుండా మోదీ ప్ర‌భుత్వం ఒంటెత్తు పోక‌డ‌ల‌కు పోయింద‌ని, నేరుగా నగదు బదిలీ వంటి చ‌ర్య‌ల ద్వారా ప్ర‌జ‌ల క‌ష్టాల‌ను తీర్చ‌వ‌చ్చ‌ని, ఆది ఆర్థిక వ్య‌వ‌స్థ‌కూ మంచిద‌ని కాంగ్రెస్ పార్టీ సూచించినా బీజేపీ ప్రభుత్వం విన‌లేద‌న్నారు.
వాస్త‌వానికి 2016-17 ఆర్థిక సంవ‌త్స‌రం నుంచీ జీడీపీ క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చి, క‌రోనా దెబ్బ‌కు ప్ర‌తికూల వృద్థిలోకి జారిపోయిన‌ట్టు కొన్ని నివేదికలు వెల్ల‌డిస్తున్నాయి. దీనినే ప్ర‌స్తావిస్తూ గ‌డ‌చిన నాలుగు త్రైమాసికాల్లో ఆర్థిక వ్య‌వ‌స్థ ప‌నితీరు తీవ్ర నిరాశ క‌లిగిస్తోంద‌ని, మొదటి రెండు త్రైమాసికాల్లో రెసిషన్ -24.4, -7.4 శాతంగా ఉండ‌గా, మూడు, నాలుగో త్రైమాసికాల్లో కూడా కోలుకోలేని పరిస్థితే నెల‌కొంద‌ని చిదంబ‌రం తెలిపారు. జాతీయ గణాంకాల కార్యాలయం సోమవారంనాడు విడుదల చేసిన గణాంకాలను ప్రస్తావిస్తూ, నాలుగో క్వార్టర్‌లో 1.6 శాతం వృద్ధి నిరాశాజనకమన్నారు. గత ఏడాది కరోనా త‌గ్గిన‌ట్టు క‌నిపించిన స‌మ‌యంలో ఆర్థిక మంత్రి, ఆమె ప్రధాన ఆర్థిక సలహాదారు ఆర్థిక వ్య‌వ‌స్థ స్థ కోలుకుంటోంద‌ని,  వి-స్పీడ్ రికవరీ అంటూ క‌ట్టుక‌థ‌లు చెప్పార‌ని చిదంబరం విమర్శించారు. ఆర్థిక వ్య‌వ‌స్థ కోలుకునేందుకు గ‌ట్టి చ‌ర్య‌లు చేప‌ట్ట‌కుంటే మ‌రింత సంక్షోభం త‌ప్ప‌ద‌ని ఆయ‌న హెచ్చ‌రించారు. . గత ఏడాదితో పోల్చుకుంటే తలసరి జీడీపీ 8.2 శాతం తగ్గిందని, దీంతో పెద్ద సంఖ్య‌లో ప్రజలు పేదరికంలోకి వెళ్లిపోయారన్నారు. సెకెండ్ కోవిడ్ వేవ్‌తో కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయారని, 97 శాతం కుటుంబాల ఆదాయం తగ్గిందని ఇచ్చిన‌ సీఎంఐఈ నివేదికను ఆయ‌న ప్ర‌స్తావించారు. బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వ అసమర్థ ఆర్థిక నిర్వహణతోనే దేశానికి ఈ కష్టాలు వ‌చ్చాయ‌ని, దేశాన్నిఈ ప‌రిస్థితినుంచి గట్టెక్కించేందుకు ఇప్ప‌టికైనా ఆర్థిక నిపుణుల స‌ల‌హాలు, విప‌క్షాల అభిప్రాయాలు తీసుకోవాల‌ని చిదంబ‌రం డిమాండ్ చేశారు. మ‌రి మాజీ ఆర్థిక‌మంత్రి సూచ‌న‌ల‌కు మోదీ ప్ర‌భుత్వం ఏమాత్రం గౌర‌వ‌మిస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: