ముగ్గురిని క‌న‌డం మావల్ల‌కాదంటున్న చైనా ప్ర‌జ‌లు..?

నాలుగు ద‌శాబ్దాలుగా క‌ఠినంగా అమ‌లు చేసిన జ‌నాభా నియంత్ర‌ణ విధానాన్ని చైనాలోని క‌మ్యూనిస్టు ప్ర‌భుత్వం మార్చుకుని ప్ర‌తిజంట‌ ముగ్గురు పిల్ల‌ల‌ను క‌నేందుకు అనుమ‌తించాల‌ని తాజాగా నిర్ణ‌యించిన విష‌యం తెలిసిందే. అయితే దీనికి చైనా ప్ర‌జ‌ల‌నుంచి ఏమంత సానుకూల‌త క‌నిపించ‌డం లేదు స‌రిక‌దా.. తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతుండ‌టం విశేషం. ప్ర‌త్యేకించి ఉద్యోగినులు ఈ నిర్ణ‌యం ప‌ట్ల ఏమాత్రం సానుకూలంగా లేర‌ట‌. దీనికి స‌హేతుక‌మైన కార‌ణాలే ఉన్నాయి. చాలాకాలంగా ఒక‌రినే క‌ని పెంచ‌డం అల‌వాటైన చైనా ప్ర‌జ‌లు, ప్ర‌స్తుతం జీవ‌న వ్య‌యం బాగా పెరిగిన నేప‌థ్యంలో ముగ్గురు పిల్ల‌ల పెంప‌కం, చ‌దువుల‌క‌య్యే  వ్య‌యం భారంగా భావిస్తున్నార‌ట‌. అంతేకాకుండా చైనా ప్ర‌భుత్వం ఉద్యోగుల‌కు సంబంధించి వారు ప‌నిచేసే సంస్థ‌ల‌కు ముందుగా ఈ విష‌యంపై ఎలాంటి మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేయ‌క‌పోవ‌డంతో ప్ర‌సూతి సెల‌వుల‌కు తీవ్రంగా ఇబ్బందులు ప‌డ‌క త‌ప్ప‌ద‌ని అధిక శాతం మ‌హిళా ఉద్యోగుల అభిప్రాయం. ప్ర‌భుత్వ ప్రైవేటు రంగ సంస్థ‌ల్లో చైనాలో ప‌నిగంట‌ల‌కు మిగ‌తా దేశాల్లో ప‌నిగంట‌ల‌కూ సంబంధం ఉండ‌ద‌నే విమ‌ర్శ‌లున్నాయి.

    క‌మ్యూనిస్టు దేశం అయిన‌ప్ప‌టికీ పాశ్చ్యాత్య దేశాల నుంచి పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం కోసం చైనా మూడు ద‌శాబ్దాలుగా కొన్నిపెట్టుబ‌డిదారీ అనుకూల విధానాల‌ను అమ‌లు చేస్తోంది. వీటి ప్ర‌కారం ఏదైనా సంస్థ‌లోప‌నిచేసే మ‌హిళా ఉద్యోగులు త‌మ‌కు ప్ర‌సూతి సెల‌వులు కావాల‌ని కోరితే వారిని ఉద్యోగాల నుంచే తొల‌గించేందుకూ ఆ సంస్థ‌లు వెనుకాడ‌వ‌ని తెలుస్తోంది. మ‌రికొన్నికంపెనీల‌యితే ఉద్యోగుల‌కు ఆ ఉద్దేశం లేద‌ని తేల్చుకున్నాకే వారికి కొలువు ఇస్తాయ‌ట‌. మ‌రోప‌క్క ఇప్ప‌టికే వృద్ధుల సంఖ్య పెరుగుతుండ‌టంతో వారి ఆరోగ్య సంర‌క్ష‌ణ బాధ్య‌త‌లూ తామేచూసుకోవాల్సి ఉంటుంద‌ని, ఇటు పిల్ల‌ల‌నూ ఎక్కువ‌మందిని కంటే వారి బాగోగులు చూసుకోవ‌డం క‌ష్ట‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్న‌ప్పుడు సుఖాన ఉన్న ప్రాణాన్ని క‌ష్టాన పెట్టుకుని దేశ జ‌నాభా పెంచే కార్య‌క్ర‌మానికి స‌హ‌క‌రించేందుకు చైనా ప్ర‌జ‌లు ఇష్టప‌డ‌టం లేద‌ని తెలుస్తోంది. ముగ్గురు పిల్ల‌ల‌ను క‌నేందుకు అనుమ‌తిస్తూ చైనా ప్ర‌భుత్వం సోమ‌వారం నిర్ణ‌యం ప్ర‌క‌టించ‌డంతో అక్క‌డి ప్ర‌జ‌ల్లో దీనిపై విస్తృత స్థాయిలో చ‌ర్చ జ‌రుగుతోంది. మ‌రి త‌న నిర్ణ‌యానికి ప్ర‌జ‌ల మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్టేందుకు ప్ర‌భుత్వం వారికి ఎలాంటి ప్రోత్సాహ‌కాలు ప్ర‌క‌టించ‌నుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: