యోగికి మోదీ శుభాకాంక్షలు ఎందుకు చెప్పలేదంటే..?
ప్రధాన మంత్రి కార్యాలయం ఈ పుకార్లను ఖండించింది. దేశంలో కొవిడ్ కరాళ నృత్యం చేస్తున్న వేళ, ఇలా పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడం మంచి పద్ధితి కాదని, అందుకే ప్రధాని మోదీ, యోగికి శుభాకాంక్షలు చెప్పలేదని అంటున్నారు. కొవిడ్ సెకండ్ వేవ్ మొదలైన తర్వాత మోదీ ఎవరికీ ఇలా సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు చెప్పలేదనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయితే ప్రధాని నేరుగా యోగికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారట.
ఇక అదే సమయంలో ఉత్తర ప్రదేశ్ వ్యవహారాలపై కూడా బీజేపీ అధిష్టానం గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. 2022లో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అక్కడ యోగి ప్రభుత్వం పరిస్థితి అంత బాగోలేదు. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా ప్రజలు అధికార పార్టీని చిత్తు చిత్తుగా ఓడించారు. దీంతో అక్కడ వచ్చే దఫా బీజేపీకి అధికారం కష్టమేనని అంటున్నారు. అందుకే యోగిని పదవినుంచి తొలగించాలనే ఆలోచనలో అధిష్టానం ఉందనే పుకార్లు కూడా వినిపించాయి. ఎన్నికల ఏడాదిలో సీఎం కుర్చీతో బీజేపీ ప్రయోగం చేసేట్టు లేదు కానీ, మంత్రివర్గ విస్తరణ మాత్రం కచ్చితంగా ఉంటుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు. కొత్తవారికి అవకాశం ఇచ్చి, ఉత్తర ప్రదేశ్ లో బీజేపీ పరిస్థితి చక్కదిద్దాలనుకుంటుందట అధిష్టానం. ఈమేరకు బీఎల్ సంతోష్, రాధా మోహన్ సింగ్ తో ఓ కమిటీ కూడా వేశారు. యోగి పాలనపై ప్రశంసలు కురిపిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిన సంతోష్.. సీఎం మార్పు వ్యవహారాన్ని పరోక్షంగా తోసిపుచ్చారు. అదే సమయంలో యోగి టీమ్ ని మాత్రం పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు సిద్ధమయ్యారు.