షర్మిల పార్టీ గూటికి ఆ పార్టీ నేతలు ?
దివంగత రాజకీయ నాయకుడు మరియు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం అయిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన పాలనా స్పూర్తితో ఇప్పటికే తన కుమారుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో సంక్షేమం పరంగా అద్భుతమైన పాలనను అందిస్తున్న విషయం తెలిసిందే. అదే బాటలో వైఎస్ తనయ షర్మిల తెలంగాణలో రాజకీయ పార్టీని స్థాపించి నాన్న ఆశయాలను కొనసాగించాలనే ఒక కృత నిశ్చయంతో అక్కడ అడుగేసింది. రాజకీయాలంటే నిత్యం వివాదాల్లో ఉంటూ ఉంటాము. ఇది సాధారణమే, షర్మిల కూడా పలు విమర్శలను ఎదుర్కుంటూ ఉంది. ఎన్ని విమర్శలు చేసినా వాటికి భయపడకుండా తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళుతోంది. ఇప్పటికే పార్టీ పెడుతున్నానని పరోక్షంగా తెలంగాణలో ఉన్న స్వార్ధ పూరిత రాజకీయ పార్టీలకు సందేశాన్ని పంపింది. ఈ ఆశయ సాధనలో షర్మిలకు మద్దతుగా ఎంతోమంది వస్తున్నారు.
కొంతమంది అయితే ఏకంగా అధికార పార్టీకి రాజీనామా చేసి మరీ షర్మిలను కలిసిన సందర్భాలను చూశాము. రోజు రోజుకీ షర్మిలకు తెలంగాణలో మద్దతు పెరుగుతూ ఉంది. రాజశేఖర్ రెడ్డి పై అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ షర్మిలను ఆదరిస్తున్నారు. కొద్ది రోజుల్లోనే అధికారికంగా పార్టీ పేరును ప్రకటించనుంది. ఇప్పటికే దీనికి సంబంధిచిన అన్ని సన్నాహాలను పూర్తి చేసినట్లు సమాచారం. ఇప్పుడు తెలంగాణ పొలిటికల్ సర్కిల్ లో వినిపిస్తున్న ఒక వార్త షర్మిలకు మరింత ధైర్యాన్నిచ్చేలా ఉంది. పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రక్రియలో భాగంగా షర్మిల రాష్ట్రమంతా పర్యటిస్తూ ఉన్న సంగతి తెలిసిందే. ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు నాయకులు షర్మిలతో టచ్ లోకి వచ్చినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
ఈ ఇద్దరు నాయకులు కూడా వైఎస్సార్ అంటే అమితమైన అభిమానం ప్రేమ ఉన్నవారే కావడం విశేషం. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ ఇద్దరు నేతలు వైఎస్ షర్మిల పార్టీలోకి చేరబోతున్నట్లు వినికిడి. షర్మిలకు ఆర్ధికంగా కూడా మద్దతు ఇవ్వగల సంపద వీరి సొంతం. జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే షర్మిల అన్నట్టుగా తెలంగాణలో రానున్న ఎన్నికల్లో గెలిచినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇదంతా ఆ మహానాయకుడిపై ఉన్న గౌరవం, ప్రేమ, అభిమానం, విశ్వాసం అని చెప్పాలి. మరి ఈ విషయంపై పార్టీ పెట్టే నాటికి అధికారికంగా మరికొంత సమాచారం తెలిసే అవకాశం లేకపోలేదు. ముందు ముందు ఏమి జరగనుందో చూడాలి.