కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో 44వ జీఎస్‌టీ మండలి సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ ఆర్థిక మంత్రి హరీశ్ రావు, సీఎస్ సోమేష్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూ ప్రసాద్ బీఆర్కే భవన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ...దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు కాపాడాలని కోరారు. అవసరాలకు తగినంతగా దేశీయంగా కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి కావడం లేదని, దేశ అవసరాల మేరకు విదేశాల నుంచి దిగుమతి చేసుకుని అయినా ప్రణాళికాబద్ధంగా, వేగంగా ప్రజలకు అందించాలని సూచించారు.
మూడో విడత కోవిడ్ ఉధృతి వస్తుందన్న శాస్త్రవేత్తల హెచ్చరికల నేపథ్యంలో కేంద్రం వ్యాక్సినేషన్ కార్యక్రమం త్వరగా చేపట్టాలన్నారు. కోవిడ్ 19 చికిత్స కు అవసరమైవ ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, హ్యాండ్ శానిటైజర్లు, వెంటిలేటర్ సహా ఇతర వైద్య సామగ్రిపై పన్నుల విధింపుపై మేఘాలయ సీఎం కన్రాడ్ సంగ్మా నేతృత్వంలోని గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ సిఫారసులకు హరీష్ రావు మద్దతు తెలిపారు. కమిటీ లోని సభ్యులకు, అధికారులకు ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాకుండా ఎఫ్ఆర్బీఎం పెంచాలని కోరారు.
కోవిడ్ ఉధృతి కారణంగా తెలంగాణ రాష్ట్రంలో లాక్‌డౌన్ సాగుతోందని.... ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉందని సమావేశంలో నిర్మలా సీతారామన్ కు హరీష్ రావు తెలిపారు. ఈ లాక్ డౌన్ ఎప్పటి వరకూ కొనసాగుతుందో తెలియదన్నారు. మే నెలలోలాక్ డౌన్ వల్ల 4100కోట్లు ఆదాయాన్ని తెలంగాణా రాష్ట్రం కోల్పోయిందని తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఎఫ్ ఆర్ బీఎం ను 4 నుంచి ఐదు శాతానికి పెంచాలని కోరారు. ఎఫ్ ఆర్ బీఎం పెంపు వల్ల దేశ, రాష్ట్ర ఆర్థిక కార్యక్రమాలు పుంజుకుంటాయని, ఉద్యోగ కల్పన పెరుగుతుందని అన్నారు.