కేరళ తీరంలో కొత్త దీవి.. గూగుల్ బయట పెట్టిన రహస్యం
కేరళలోని కొచ్చి తీరంలో అరేబియా సముద్ర గర్భంలో ఓ దీవిలాంటి నిర్మాణం కనిపించటం హాట్ టాపిక్ అవుతోంది. ఈ కొత్తదీవి వంటి నిర్మాణాన్ని మొదట గూగుల్స్ మ్యాప్స్ బయటపెట్టింది. గూగుల్ మాప్స్ ద్వారా అరేబియా సముద్రంలో ఓ దీవి లాంటి నిర్మాణాన్ని మొదట ఓ టూరిజం సంస్థ గుర్తించింది. ఆ తర్వాత ఈ కొత్త దీవి పై అనేక మంది పరిశోధనలు ప్రారంభించారు. కొందరు ఔత్సాహికులు సొంతగా ఈ దీవి గురించి తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇక ఇప్పుడు కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్ వర్శిటీ ఈ కొత్త దీవిపై పరిశోధన ప్రారంభించింది.
గూగుల్ మాప్స్ లో ఈ దీవిని గుర్తించిన టూరిస్టు సంస్థ దాని గురించి ఫేస్బుక్లో పోస్టు పెట్టింది. దీంతో ఈ రహస్య దీవి విషయంపై చర్చ మొదలైంది. ఈ కొత్త దీవి కొచ్చి తీరానికి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దీవి 8 కిలో మీటర్ల పొడవు, మూడున్నర మీటర్ల వెడల్పులో ఉన్నట్టు ఆ టూరిజం సొసైటీ చెప్పింది. అంతే కాదు.. ఈ దీవి సంగతేంటో తేల్చండి అంటూ కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్‌కు ఓ లెటర్ రాసింది.
ఇంతకూ ఈ దీవి ఏంటి.. ఇది ఎప్పటి నుంచి ఉంది.. కొత్తగా ఏర్పడిందా.. పాతదేనా.. ఇక్కడ ఏం ఉన్నాయి.. అనే అంశాలపై ఇంకా స్పష్టత లేదు. దీనిపై కేరళ యూనివర్సిటీ ఆఫ్ ఫిషరీస్ అండ్ ఓషియన్ స్టడీస్ నివేదిక వస్తే గానీ ఓ క్లారిటీ రాదు.