కరోనా సెకండ్ వేవ్ నుండి ఎలాగోలా బయటపడ్డాం అనుకునే లోపు, మూడవ దశలో చిన్నారుల పై
కరోనా ముప్పు పొంచి ఉంది అనే అంచనాలు అధికంగా ఉన్న వేళ చిన్నారుల తల్లితండ్రులు భయభ్రాంతులతో బిక్కుబిక్కుమంటున్నారు. అందులోనూ ఇప్పుడు
తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా లాక్ డౌన్ ఎత్తి వేయడంతో తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికి పరిస్థితి బాగానే ఉన్నా మరో ఆరు వారాల్లో కోవిడ్ మళ్లీ విజృబించే అవకాశాలు ఉన్నాయన్న వార్తలతో సతమతమవుతున్నారు. అందులోనూ జులై 1 నుండి విద్యాసంస్థలు తిరిగి ప్రారంభం కానుండడంతో ఎటూ కాని అయోమయ పరిస్థితుల్లో పూర్తి కన్ఫ్యూజన్ లో ఉన్నారు తల్లిదండ్రులు. ఓ వైపు పిల్లల భవిష్యత్తు మరో వైపు వారి ప్రాణం రెండింటి మధ్య నలిగిపోతున్నారు.
అందరితో పాటు
స్కూల్ కు పంపిస్తే వైరస్ అంటుకుంటుంది ఏమో అన్న అనుమానం ఓ వైపు, పంపకపోతే మిగిలిన పిల్లలు చదువులో ముందుకు వెళ్లగా తన బిడ్డ మాత్రం చదువులో వెనుకబడిపోతాడేమోనన్న భయం మరో వైపు వీరిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఈ క్రమంలో అధిక శాతం మంది తల్లిదండ్రులు థర్డ్ వేవ్ పొంచి ఉన్న నేపథ్యంలో తమ పిల్లలను తిరిగి స్కూల్స్ కు పంపించేందుకు సిద్ధంగా లేరు. అందులోనూ 12 ఏళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహార లోపం కారణంగా ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో ఇటువంటి చిన్నారులకు
కరోనా సోకితే ప్రాణాంతకంగా మారే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్న క్రమంలో తల్లితండ్రులు విద్యాసంస్థల ఓపెనింగ్ పై సుముఖంగా లేనట్లు తెలుస్తోంది.
ఇక ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తి వేయడం పట్ల పలువురు తీవ్ర ఆందోళనలు వ్యక్తం చేస్తుండగా మరికొందరు ప్రభుత్వ నిర్ణయంతో ఏకీభవిస్తున్నారు. మరి థర్డ్ వేవ్ వస్తుందా ? అందరూ చెబుతున్నట్లుగా పిల్లలపై తన ప్రభావాన్ని చూపుతుందా ? ఏమి జరగనుందో తెలియాల్సి ఉంది.