స్కూళ్ల రీ ఓపెన్ పై నీతి ఆయోగ్ వార్నింగ్.. !

రాష్ట్రాల్లో క‌రోనా కేసులు త‌గ్గుముకం ప‌ట్ట‌డంతో పాఠ‌శాల‌ల‌ను తెరిచేందుకు రాష్ట్రప్ర‌భుత్వాలు రెడీ అవుతున్నాయి. అయితే తాజాగా పాఠ‌శాల‌లు తెర‌వ‌టం మంచిది కాద‌ని నీతి ఆయోగ్ హెచ్చ‌రించింది. కరోనా పరిస్థితులను సరిగా అంచనా వేయకుండా పాఠశాలలను తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. బడిలో కేవలం విద్యార్థులే కాక ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది కూడా ఉంటారు కాబట్టి  వైరస్ వ్యాప్తి చెందడానికి ఎక్కువ అవకాశం ఉంటుంద‌ని వీకే పాల్ అభిప్రాయం వ్య‌క్తం చేశారు. కోవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాద‌ని అన్నారు. పాఠశాలలు తెరిచే విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచిది కాద‌ని వీకే పాల్ హెచ్చ‌రించారు. 


ఉత్తమమైన రక్షణ ఉన్నప్పుడు మాత్రమే స్కూల్స్ తెరిచే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎక్కువ మందికి వ్యాక్సిన్‌ అందించి రక్షణ కల్పించినప్పుడో.. వైరస్‌ చాలావరకు తగ్గిపోయినప్పుడో మాత్రమే స్కూల్స్ తెరవడం గురించి ఆలోచించాల‌ని తెలిపారు. ఇదివరకు స్కూళ్లు తెరిచినప్పుడు వైరస్‌ విజృంభించిన సందర్భాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం వైరస్‌ తగ్గినట్టు కనిపించడానికి కారణం.. చాలా రాష్ట్రాల్లో ఆంక్షలు విధించడంతో పాటు, ప్రజలు క్రమశిక్షణతో ఉండటమేన‌ని అన్నారు. ఇప్పుడు ఆంక్షలు ఎత్తేయడంతో పాటు, పాఠశాలలు కూడా మొదలుపెడితే వైరస్‌కు మళ్లీ విజృంభించే అవకాశం ఉంద‌న్నారు.


స్కూళ్లు ఎప్పుడు తెరవాలన్న నిర్ణయం పరిశీలనలో ఉందని....రెండు మూడు మంత్రిత్వశాఖలు చర్చించి నిర్ణయం తీసుకుంటాయన్నారు. ఇప్పటివరకు ఎదురైన అనుభవాలను అనుసరించి చాలా అప్రమత్తతతో నిర్ణ‌యం తీసకోవాల‌ని తెలిపారు. ప్రజలు, ప్రభుత్వాలు అప్రమత్తంగా వ్యవహరిస్తే కరోనా మూడో వేవ్‌ రావడానికి అస‌లు అవకాశ‌మే ఉండ‌ద‌ని అన్నారు. వ్యాక్సినేషన్‌ పెరుగుతున్నకొద్దీ అత్యధిక మందికి రక్షణ లభిస్తుందని, అంతవరకూ అందరూ కట్టుదిట్టమైన నిబంధనలను పాటించాలని సూచించారు. అంతే కాకుండా మరో 5, 6 నెలలు ప్రజలు ,ప్రభుత్వం కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటించాలని అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: