తెలుగు రాష్ట్రాలకు మొండిచేయి.. అసెంబ్లీ సీట్ల పెంపులో అన్యాయం..!

MOHAN BABU
 జమ్ము కాశ్మీర్ రాష్ట్రాలకు మాత్రమే  అసెంబ్లీ సీట్లు పెంచేలా  కేంద్రం ప్రయత్నం చేస్తున్నట్టు  ఇందులో తెలుగు రాష్ట్రాలకు చోటు కల్పించడం లేదని  తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ బోయిన్పల్లి వినోద్ కుమార్ అన్నారు.  తెలంగాణ ఆంధ్ర విభజన చట్టం 2014 ప్రకారం వెంటనే అసెంబ్లీ సీట్లు పెంచాలని కోరారు. శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరిచిన విధంగా వెంటనే అసెంబ్లీ సీట్లను పెంచాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రధానమంత్రి మోడీని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కోరితే  2026 వరకు సీట్ల పెంపు కుదరదని, అందుకు రాజ్యాంగ సవరణ చేయవలసి ఉంటుందని మోడీ జవాబిచ్చారని తెలిపారు.


మరి ఈ సూత్రం జమ్ము కాశ్మీర్ కి ఎందుకు వర్తించదని వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జమ్మూకాశ్మీర్లో బీజేపీ రాజకీయంగా ఎదిగేందుకు  ప్రయత్నాలు చేస్తోందని  ఆయన అన్నారు. జమ్మూకాశ్మీర్లో అఖిలపక్ష సమావేశంలో ఈ విషయం తేలిందని వినోద్ కుమార్ వెల్లడించారు. జమ్ములో డీమిలిటేషన్ ప్రక్రియ ద్వారానే అసెంబ్లీ సీట్లు పెంచేందుకు బిజెపి ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఒకే దేశం ఒకే చట్టం అంటే ఇదేనా అని ప్రశ్నించారు. రాజకీయ కుయుక్తులు పక్కనపెట్టి తెలుగు రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్లు తక్షణమే  పెంచాలని కోరారు. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సీట్లు 119 నుంచి 153కు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని వినోద్ కుమార్ కోరారు. కొత్తగా విడిపోయిన టువంటి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు అసెంబ్లీ సీట్ల పెంపు ఎంతో అవసరమని  అన్నారు.


దేశంలో  రాజ్యాంగ చట్టాలు అందరికీ ఒకేలా ఉంటాయని, ఒక రాష్ట్రానికి ఒక తీరు, మరో రాష్ట్రానికి మరో తీరు  ఉండవని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సీట్లు పెంచి, తెలుగు రాష్ట్రాలకు మొండి చేయి చూపించడాన్ని చూస్తే కేంద్ర ప్రభుత్వానికి తెలుగు రాష్ట్రాల పై ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి తెలుగు రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల పెంపు కు కృషి చేయాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: