వైవీకి జ‌గ‌న్ ఇచ్చే గిఫ్ట్ ఇదేనా... వైసీపీలో హాట్ టాపిక్ ?

VUYYURU SUBHASH
వైవీ సుబ్బారెడ్డి. ఈయ‌న‌కు పెద్ద‌గా ప‌రిచ‌యం అక్క‌ర‌లేదు. కాంగ్రెస్ నేత‌గా.. వైఎస్ తోడ‌ల్లుడిగా ఆయ‌న  రాజ‌కీయాల్లో గుర్తింపు పొందారు. అయితే.. వైసీపీ పెట్టిన త‌ర్వాత‌.. ఆయ‌న ఏకంగా చ‌క్రం తిప్పే పొజిష‌న్‌లోకి వ‌చ్చారు. ప్ర‌కాశం జిల్లాలో 2014లో అంతా తానే అయి.. క‌థ న‌డిపించారు. ఆ ఎన్నిక‌ల్లో ఒంగోలు నుంచి ఎంపీగా పోటీ చేసి విజ‌యం ద‌క్కించుకున్నారు.  చంద్ర‌బాబు హ‌యాంలో వెలిగొండ ప్రాజెక్టు పూర్తికి పాద‌యాత్ర కూడా చేశారు. అయితే.. ఈ క్ర‌మంలోనే జిల్లాకు చెందిన ప్ర‌స్తుత మంత్రి.. సీనియ‌ర్ నాయ‌కుడు.. బాలినేని శ్రీనివాస‌రెడ్డికి, వైవీకి మ‌ధ్య ఆధిప‌త్య రాజకీయాలు తెర‌మీదికి వ‌చ్చాయి.

దీంతో గ‌త ఎన్నిక‌ల స‌మయంలో వైవీని పోటీ నుంచి త‌ప్పించి.. పార్టీ ఎన్నిక‌ల క‌మిటీలో ప్ర‌ధాన స‌భ్యుడిగా నియ‌మించారు. ఇక‌, జ‌గ‌న్ స‌ర్కారు ఏర్ప‌డిన త‌ర్వాత‌.. ఏకంగా.. ఆయ‌న‌ను టీటీడీ బోర్డు చైర్మ‌న్‌గా నియ‌మించారు. ఇది నిజానికి కీల‌క ప‌ద‌వి.. అంద‌రికీ ద‌క్క‌ని అవ‌కాశం కావ‌డంతో వైవీ కొంత సంతృప్తి చెందారు. అయితే.. ఇది రెండేళ్ల‌పాటు మాత్ర‌మే ఉంటున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల బోర్డు కాల ప‌రిమితి ముగిసి.. వైవీ ప‌ద‌వి కోల్పోయారు. నిజానికి ప్ర‌భుత్వం త‌మ‌దే కావ‌డంతో.. బోర్డు కాల‌ప రిమితిని పొడిగిస్తార‌ని అంద‌రూ అనుకున్నా.. సీఎం జ‌గ‌న్ మాత్రం బోర్డును ర‌ద్దు చేసేశారు. దీంతో ఇప్పుడువైవీకి ఎలాంటి ప‌ద‌వీ లేకుండా పోయింది.

ఈ క్ర‌మంలోనే ఇప్పుడు జ‌గ‌న్.. త‌న సొంత చిన్నాన్న‌కు ఎలాంటి గిఫ్ట్ ఇవ్వ‌బోతున్నారు? ఆయ‌న‌ను అలానే ఖాళీగా ఉంచుతా రా?  లేక కీల‌క‌మైన పోస్టును అప్ప‌గిస్తారా? అనేది చ‌ర్చ‌కు దారితీసింది. ప్ర‌స్తుతం ఉన్న లెక్క‌ల ప్ర‌కారం.. త్వ‌ర‌లోనే మ‌ళ్లీ టీటీడీ బోర్డును నియ‌మించ‌నున్నారు. దీనిలో కొత్త‌గా స‌భ్యుల‌ను ఎన్నుకుని.. మ‌ళ్లీ ఈ బోర్డు చైర్మ‌న్‌గా వైవీనే నియ‌మిస్తార‌నే ప్ర‌చారం ఒక‌టి సాగుతోంది. అయితే.. అలా కాదు..ఈ  ద‌ఫా ఆయ‌న‌ను రాజ్య‌స‌భ కు పంపుతార‌ని.. అక్క‌డ పార్టీకి చాలా అవ‌స‌రం ఉంద‌ని మ‌రో వ‌ర్గం ప్ర‌చారం చేస్తోంది.

ఇదిలావుంటే.. ఇంకొంద‌రు.. ఇవ‌న్నీ కాదు.. రాజ్య‌స‌భ‌కు పంపాలంటే.. ఆరు మాసాలు వెయిట్ చేయాలి కాబ‌ట్టి.. ఇప్ప‌టికిప్పుడు.. త్వ‌ర‌లోనే ఆయ‌న‌ను మండ‌లికి పంపించి.. కీల‌క ప‌ద‌విని..అంటే మండ‌లిలో వైసీపీ ప‌క్ష‌నేత ప‌ద‌విని అప్ప‌గిస్తార‌ని అంటున్నారు. దీంతో వైవీకి జ‌గ‌న్ ఇచ్చే `గిఫ్ట్‌` పై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొన‌డం గ‌మ‌నార్హం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: