జగన్ ఇప్పటికీ జీసస్‌తో, వైఎస్‌తో మాట్లాడతాడా..? ఏంటీ రాతలు..?

Chakravarthi Kalyan
జగన్ జీసస్‌తో మాట్లాడతారట.. జగన్ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో.. కరోనా వైరస్‌ లేదూ ఏమీ లేదు.. నేను రాత్రి జీసస్‌తో మాట్లాడాను.. అసలు వైరస్‌ లేదు. భయపడవద్దు అని జీసస్‌ చెప్పారని జగన్‌ రెడ్డి అధికారులతో అన్నారట. ముఖ్యమంత్రిపై జీసస్‌ ప్రభావం ఇంతలా ఉంటుందనీ, తాను జీసస్‌తో మాట్లాడాననే స్థితికి ఆయన చేరుకున్నారని తాము ఊహించలేదని ఆ సమయానికి అక్కడే ఉన్న అధికారి ఒకరు చెప్పారట.


అంతే కాదు.. ఆయన వైఎస్‌తోనూ మాట్లాడతారట. గతంలో పదవీ విరమణ చేసిన ఒక ఐఏఎస్‌ అధికారి వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌లో చేరాలనుకుని జగన్‌ రెడ్డిని కలిశారట. అప్పుడు జగన్‌ రెడ్డి మాట్లాడుతూ, తాను ప్రతిరోజూ రాత్రి 12 గంటలకు దివంగత రాజశేఖర రెడ్డితో చర్చిస్తానని చెప్పుకొచ్చారట. ఇవన్నీ చెప్పింది ఎవరనుకుంటున్నారా.. జగన్ గురించి ఆమూలాగ్రం తెలిసిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ.. ఆయన ఇటీవల తన కొత్త పలుకు కథనంలో ఇవన్నీ రాసుకొచ్చారు. ఇప్పుడు ఈ రాతలపై మంత్రులు మండిపడుతున్నారు.  


బాధ్యత గల పత్రికాధినేత రాధాకృష్ణ తన వార్తలతో ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని  మంత్రి ఆళ్ల నాని విమర్శించారు. సీఎం వైయస్‌ జగన్‌ను ఏదో విధంగా ప్రజలను చులకన చేసేందుకు, ఆయన్ను గద్ద దించి చంద్రబాబును సీఎం చేయాలని ఆలోచనతో రాతలు రాస్తున్నారని ఆళ్ల నాని అన్నారు. దారుణమైన అవాస్తవాలు, నీచమైన రాతలు రాధాకృష్ణ రాస్తున్నారని.. పత్రిక విలువలు కాపాడటం మరిచి పాత్రికేయ విలువలను మంట గలుపుతున్నారని మండిపడ్డారు.


సీఎం వైయస్‌ జగన్‌పై వ్యక్తిగత ద్వేషంతో  రాధాకృష్ణ ఈ రాతలు రాస్తున్నారని ఆళ్ల నాని అంటున్నారు. రాధాకృష్ణ పచ్చి అబద్ధాలతో కథనాలు రాశారని... కరోనా ప్రారంభం నుంచి ప్రతి రోజు జరిగే సీఎం సమీక్షా సమావేశంలో ఎంతో మంది అధికారులు, మంత్రులు పాల్గొంటారని.. ఇలాంటి వ్యాఖ్యలు సీఎం వైయస్‌ జగన్‌ ఎప్పుడు అనలేదని మంత్రి అన్నారు. జగన్ గురించి ఈ విధంగా రాయడం బాధాకరమని.. వ్యక్తిగతంగా వైయస్‌ జగన్‌పై బురద జల్లాలని వ్యక్తిగత ఎజెండాతో కుట్రలు చేస్తే ప్రజలే రానున్న రోజుల్లో గుణపాఠం చెబుతారని మంత్రి ఆళ్ల నాని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: