మలేరియా రహిత దేశం అదే..!

NAGARJUNA NAKKA
చైనా దేశం ఓ ఘనత సాధించిది. మ‌లేరియా ఫ్రీ దేశంగా మారిపోయింది. ఈ విషయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా వెల్లడించింది.  మ‌లేరియా వ్యాధిని అరికట్టేందుకు చైనాకు 70సంవత్సరాలు పట్టింది. 1940ల‌లో 30 మిలియ‌న్ల మ‌లేరియా కేసులు నమోదై చైనాను ఉక్కిరిబిక్కిరి చేసేవి. కానీ గ‌త నాలుగేళ్ల నుంచి చైనాలో మ‌లేరియా కేసులు వెలుగు చూడలేదు. డ్రాగన్ దేశం కట్టుదిట్టంగా తీసుకున్న చర్యల వల్ల మలేరియా క్రమంగా తగ్గుముఖం పట్టింది. చివ‌ర‌కు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.  మ‌లేరియా ర‌హిత దేశంగా చైనా అవ‌త‌రించింది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ టెడ్రోస్ అధానామ్ గేబ్రియ‌స్.. ఆ దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు చెప్పారు.  మలేరియా ర‌హిత దేశాల జాబితాలో చైనా 40వ దేశంగా స్థానం సంపాదించుకుంది.
అలాంటి ఘనత సాధించాలంటే.. వరుసగా మూడు సంవత్సరాలు మలేరియా కేసులు నమోదు కాకపోతే ఆ దేశం ప్రపంచ ఆరోగ్య సంస్థకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు.ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ పూర్తి వివరాలు సేకరించి మలేరియా రహిత దేశంగా ప్రకటిస్తుంది. 2018వ సంవత్సరంలో  2018లో ఉజ్బెకిస్తాన్, పారాగూయి, 2019లో అల్జిరియా, అర్జెంటీనా, 2020లో స‌ల్వాడ‌ర్ దేశాలు మ‌లేరియా ఫ్రీ దేశాలుగా ఖ్యాతికెక్కాయి. ముఖ్యంగా మలేరియా ఆఫ్రికన్ దేశాలలో ప్రమాదకరంగా పరిగణించబడింది. అక్కడ మలేరియా బారిన పడి ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యాధి ప్రభావంతో 2018లో 4లక్షలా 11వేలు,  2019 లో 4లక్షలా 90వేల మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 లో ప్రపంచవ్యాప్తంగా నమోదయిన మలేరియా కేసుల సంఖ్య 229 మిలియన్లుగా తెలిసింది.
 
దాదాపు 90 శాతం మలేరియా మరణాలు ఆఫ్రికాలో వెలుగుచూస్తున్నాయి. ఎక్కువ శాతం చిన్నారులు ఈ మహ్మమారి బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు ముఖ్యంగా చైనా దేశం మలేరియాను అరికట్టేందుకు చాలా ప్రయత్నాలే చేసింది. మందులు పిచికారి చేయడం, దోమతెరలు వాడటం లాంటివి చేసి దోమల వ్యాప్తిని నిర్మూలించ గలిగింది. అంతేకాదు 1970లలో అయితే ఆర్టిమిసినిన్ అనే యాంటి మలేరియల్ మందులు ఆవిష్కరించారు. 1990 చివరి నాటికి, చైనాలో మలేరియా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 95శాతం మరణాలు తగ్గాయి. ఇన్నేళ్ల పోరాటం తర్వాత చైనా మలేరియా ఫ్రీ దేశంగా నిలిచింది. ఇతర దేశాలకు ఆదర్శంగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: