ఆ విషయంలో జగన్ భయం నిజమేనా?
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి...హైదరాబాద్‌లో ఉన్న తమ రాష్ట్ర ప్రజల గురించి ఆందోళన చెందుతున్నారా? ప్రస్తుతం ఏపీ-తెలంగాణల మధ్య జరుగుతున్న నీటి వివాదంలో జగన్ గట్టిగా మాట్లాడితే హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలకు ఇబ్బంది అవుతుందా? అంటే తాజాగా జగన్ మాటలని బట్టి చూస్తే అవుననే చెప్పొచ్చు. అంటే సీఎం జగన్ వర్షన్ ప్రకారం నీటి వివాదంపై గట్టిగా మాట్లాడితే హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలు ఇబ్బంది పడతారనే చెప్పొచ్చు.
కానీ వాస్తవానికి చూస్తే హైదరాబాద్‌లో అలాంటి పరిస్తితి ఉందా? అంటే అసలు లేదనే చెప్పొచ్చు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే ఏపీ-తెలంగాణ రాజకీయ నాయకుల మధ్య మాటల యుద్ధం జరిగింది గానీ, ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు రాలేదని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అసలు హైదరాబాద్‌లో ప్రజలు ప్రశాంతంగా ఉన్నారని, కానీ రాజకీయ నాయకులే రాజకీయంగా మాట్లాడుతున్నారని అంటున్నారు.
అయితే రాయలసీమ ఎత్తిపోతల పథకం విషయంలో తెలంగాణ మంత్రులు తీవ్ర స్థాయిలో ఏపీలోని జగన్ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇక ఇక్కడ విచిత్రం ఏంటంటే చనిపోయిన వైఎస్సార్‌ని సైతం తెలంగాణ మంత్రులు తిడుతున్నారు. తెలంగాణ సెంటిమెంట్‌ని లేపి రాజకీయంగా లబ్ది పొందటానికే తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారని విశ్లేషకులు అంటున్నారు. హుజూరాబాద్ ఉపపోరులో గెలవడానికే ఇలా మంత్రులు మాట్లాడుతున్నారని తెలంగాణలోని కాంగ్రెస్, బీజేపీలు మాట్లాడుతున్నాయి.
సరే తెలంగాణ మంత్రులు ఎంత తిట్టినా ఏపీలోని వైసీపీ నేతలు మాత్రం రివర్స్‌లో ఘాటుగా స్పందించకపోవడంపై కూడా విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మామూలుగా ఏపీ మంత్రులు ఎలా మాట్లాడుతారో అందరికీ తెలుసు. కానీ తెలంగాణ విషయంలో మాత్రం ఘాటుగా స్పందించడం లేదు. పైగా సీఎం జగన్ సైతం తాము ఘాటుగా స్పందిస్తే హైదరాబాద్‌లోని తమ ప్రజలకు ఇబ్బంది అవుతుందని కామెంట్ చేసినట్లు రావడం వింతగా ఉందని అంటున్నారు. అసలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా ప్రజలు హైదరాబాద్‌లో ఉంటే, జగన్ రాజకీయంగా లబ్ది పొందటానికే అలా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. హైదరాబాద్‌లో తనకున్న ఆస్తులకు ఇబ్బంది వస్తుందనే జగన్ భయపడుతున్నారని విమర్శిస్తున్నారు. ఏదేమైనా జగన్ మాటల్లో ఉన్న భయం హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజల్లో లేదనే చెప్పొచ్చు.