నిరుద్యోగులకు బ్రహ్మాండమైన గుడ్‌ న్యూస్ వినిపించనున్న కేసీఆర్‌ ?

Chakravarthi Kalyan
తెలంగాణలో నిరుద్యోగులు చాలా కాలంగా కేసీఆర్ ప్రభుత్వం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణ సాధించుకున్నా.. ఉద్యోగాల విషయంలో నోటిఫికేషన్లు రావడం లేదని నిరాశగా ఉన్నారు. ఉద్యోగాల నోటిఫికేషన్లకు జిల్లాల పునర్విభజన ఓ పెద్ద అడ్డంకి ఇన్నాళ్లూ మారింది. జిల్లాల పునర్విభజనకు రాష్ట్రపతి ఆమోదం తెలపాల్సిరావడం.. ఈ ప్రక్రియ మొత్తం పూర్తయ్యేసరికి ఏళ్లు పట్టింది. దీనికి తోడు మళ్లీ 31 జిల్లాలను 33 జిల్లాలు చేయడంతో.. కొత్త జిల్లాల కోసం మరోసారి సవరణ అవసరమైంది. మొత్తానికి కొన్ని రోజుల క్రితమే ఈ జిల్లాల పునర్విభజన వ్యవహారం పూర్తయింది.


కొత్త జోన్లకు ఆమోదం రావడంతో ఇక ఉద్యోగాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి. ముందుగా తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖ నుంచి భారీ నోటిఫికేషన్‌ రాబోతోందని చెబుతున్నారు. ఏకంగా ఒకేసారి 19 వేల పైచిలుకు కొలువుల్ని భర్తీ చేసేందుకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారట. దీనికి సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తయిందని సీఎం కేసీఆర్‌ ఆదివారం నోటిఫికేషన్ గురించి ప్రకటించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. ఇవాళ సీఎం కేసీఆర్ సిరిసిల్ల పర్యటనకు వెళ్తున్నారు.


సిరిసిల్ల పర్యటనలోనే కేసీఆర్ ఈ 19 వేల ఉద్యోగాల ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాలకు సంబంధించి ఇదే భారీ నోటిఫికేషన్‌ అవుతుంది. తెలంగాణ వచ్చాక  2014లో తొలిసారి పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చింది. ఆ తరవాత 2018లో మరోసారి  భారీగా  పోస్టులు ప్రకటించారు. 2018లో 1,217 మంది ఎస్సైలు, 16,925 మంది కానిస్టేబుళ్ల భర్తీకి నోటిఫికేషన్‌ వచ్చింది.


అయితే 2018 నోటిఫికేషన్‌లో దాదాపు 3 వేల వరకు బ్యాక్‌లాగ్‌ పోస్టులు మిగిలాయి. ఇవన్నీ కలిపి ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ సిద్దం చేశారు. ఈ పోస్టుల్లో 33శాతం మహిళలకు కేటాయించనున్నారు. కొత్త నోటిఫికేషన్‌లో ఎస్సై -360(సివిల్‌), 29(ఏఆర్‌), 20(కమ్యూనికేషన్స్‌) ఉద్యోగాలు ఉన్నట్టు తెలుస్తోంది. కానిస్టేబుళ్లు- 7,700(సివిల్‌), 6,680(ఏఆర్‌), టీఎస్‌ఎస్‌పీ(3,850), 15వ బెటాలియన్‌(560), కమ్యూనికేషన్‌(250).. ఇలా మొత్తం 19,449 పోస్టులు ఉన్నట్టు తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: