అక్కడ జనసేన టీడీపీకి మైనస్...కలిస్తే వైసీపీకి షాక్?
ఏపీ రాజకీయాల్లో బలంగా ఉన్న అధికార వైసీపీని ఢీకొట్టాలంటే ప్రతిపక్ష టీడీపీ బలం ఏ మాత్రం సరిపోవట్లేదనే చెప్పొచ్చు. టీడీపీ ఒక్కటే పోరాడితే వైసీపీని ఎదురుకోవడం కష్టమని, జనసేన కలిస్తేనే వైసీపీపై పోరాడటానికి అవకాశం ఉంటుందని, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లు కలిస్తేనే జగన్‌ని ఎదురుకోగలరని, లేదంటే జనసేన విడిగా పోటీ చేస్తే టీడీపీకే డ్యామేజ్ అని చెబుతున్నారు.
గత ఎన్నికల్లోనే జనసేన విడిగా పోటీ చేయడం వల్ల టీడీపీకి జరగాల్సిన నష్టం జరిగిపోయిందని, చాలా నియోజకవర్గాల్లో టీడీపీకి భారీ షాకులు తగిలాయని, అలాగే వైసీపీకి బాగా అడ్వాంటేజ్ అయిందని గుర్తు చేస్తున్నారు. అటు జనసేన విడిగా పోటీ చేయడం వల్ల, ఆ పార్టీకి కూడా నష్టం బాగా జరిగిందని, అదే టీడీపీతో పొత్తులో పోటీ చేసి ఉంటే ఫలితాలు వేరుగా వచ్చేవని అంటున్నారు.
అలా పొత్తు లేకపోవడం వల్ల రెండు పార్టీలు నష్టపోయిన పార్లమెంట్ స్థానాల్లో మచిలీపట్నం కూడా ఒకటి. 2014లో పవన్ సపోర్ట్ ఇవ్వడం వల్ల ఈ పార్లమెంట్లో టీడీపీ సత్తా చాటింది. పార్లమెంట్ పరిధిలో ఉన్న అవనిగడ్డ, పెనమలూరు, గన్నవరం, మచిలీపట్నం, పెడన స్థానాల్లో టీడీపీ గెలిస్తే, గుడివాడ, పామర్రుల్లో మాత్రమే వైసీపీ గెలిచింది. కానీ 2019 ఎన్నికల్లో పొత్తు లేకపోవడం వల్ల టీడీపీ ఒక్క గన్నవరంలోనే గెలవగా, మిగిలిన అన్నీ స్థానాల్లో ఓడిపోయింది.
ఓడిపోయిన నియోజకవర్గాల్లో టీడీపీ మీద వైసీపీకి వచ్చిన మెజారిటీలు కంటే జనసేనకి పడిన ఓట్లే ఎక్కువ. మచిలీపట్నం, పెడన, అవనిగడ్డ, పెనమలూరు నియోజకవర్గాల్లో అదే పరిస్తితి ఉంది. ఇక గుడివాడలో జనసేన అసలు పోటీలో లేదు. ఇలా రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేయడం వల్ల వైసీపీకి అడ్వాంటేజ్ అయిందని, అదే కలిసి పోటీ చేసి ఉంటే వైసీపీకి షాక్ తగిలేది అని విశ్లేషకులు చెబుతున్నారు. మరి నెక్స్ట్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందో లేదో చూడాలి.