కుప్పంలో బాబుకు షాక్...ఇంకా ఫిక్స్ అయిపోయినట్లేనా!

M N Amaleswara rao
కుప్పంలో చంద్రబాబుకు భారీ షాక్ తగులనుందా? వచ్చే ఎన్నికల్లో ఇక్కడ బాబుకు వైసీపీ చెక్ పెట్టేస్తుందా? అంటే వైసీపీ శ్రేణులు, వైసీపీ అనుకూల మీడియా కథనాల ప్రకారం అవుననే సమాధానం వస్తుంది. కుప్పం అంటే చంద్రబాబుకు కంచుకోట అనే విషయం తెలిసిందే. ఇక్కడ బాబు సొంత సామాజికవర్గం కమ్మ ఓట్లు ఎక్కువ లేకపోయినా సరే దశాబ్దాల కాలం నుంచి ఇక్కడున్న ప్రజలు బాబుకు సపోర్ట్‌గా ఉంటున్నారు. 1989, 1994, 1999, 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో కుప్పం ప్రజలు బాబుని గెలిపించారు.

అయితే ఇప్పుడు అధికారంలో వైసీపీ, బాబుని దెబ్బతీయడమే లక్ష్యంగా పనిచేస్తుంది. గత ఎన్నికల్లోనే బాబుకు మెజారిటీ తగ్గింది. అదే ఊపుతో బాబుకు చెక్ పెట్టాలని మంత్రి పెద్దిరెడ్డి రామంచంద్రారెడ్డి, వైసీపీ నేతలు చూస్తున్నారు. ఈ క్రమంలోనే పంచాయితీ ఎన్నికల్లో బాబుకు ఊహించని షాక్ ఇచ్చారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో వైసీపీ 80 శాతంపైనే పంచాయితీలని వైసీపీ గెలుచుకుంది.

దీంతో కుప్పంలో బాబు సీన్ అయిపోయిందని వైసీపీ చెబుతుంది. అలాగే కుప్పంలో ప్రభుత్వ పథకాలని జగన్ అద్భుతంగా అమలు చేస్తున్నారని, అమ్మఒడి, జగనన్న కాలనీలు, పెన్షన్, వైఎస్సార్ చేయూత, నాడు-నేడు, ఆరోగ్యశ్రీ...ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలని కుప్పం ప్రజలకు ఇస్తున్నారని వైసీపీ అనుకూల మీడియా చెబుతుంది. అలాగే గతంలో జరగని అభివృద్ధి ఇప్పుడు చేసి చూపిస్తున్నారని, దీంతో కుప్పం ప్రజలు జగన్‌కు మద్ధతుగా నిలిచేందుకు సిద్ధమయ్యారని, కుప్పం నియోజకవర్గానికి పట్టిన చంద్రగ్రహణం వీడుతుందని అంటున్నారు. అంటే వచ్చే ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబు ఓడిపోతారని వైసీపీ శ్రేణులు చెబుతున్నాయి.

ఇక వైసీపీకి టీడీపీ శ్రేణుల నుంచి గట్టిగానే కౌంటర్లు వస్తున్నాయి. కుప్పం బాబు కంచుకోట అని, అక్కడ టీడీపీని ఓడించడం కష్టమని చెబుతున్నారు. రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఇవే పథకాలు అమలు చేస్తున్నారని, అంటే 175 చోట్ల వైసీపీ గెలుస్తుందా? అని ప్రశ్నిస్తున్నారు. గతంలో చంద్రబాబు అధికారంలో ఉండగా, పులివెందులలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారని, అక్కడి ప్రజలకు పథకాలు అందించారని, అలా అని అక్కడి ప్రజలు టీడీపీ వైపు మొగ్గు చూపించలేదని, జగన్‌ని భారీ మెజారిటీతో గెలిపించుకున్నారని గుర్తు చేస్తున్నారు. కాబట్టి కుప్పంలో బాబుకు షాక్ తగలదని, వైసీపీ పగటి కలలు కనడం ఆపాలని కౌంటర్లు ఇస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: