అంతరిక్ష ప్రయాణం గురించి శిరీష చెప్పిన షాకింగ్‌ కబుర్లు..?

Chakravarthi Kalyan
బండ్ల శిరీష.. మన తెలుగు అమ్మాయి. స్వస్థలం గుంటూరు జిల్లా.. ఇటీవల వర్జిన్ గెలాక్టిక్ సంస్థ నిర్వహించిన అంతరిక్ష ప్రయోగంలో పాల్గొని వార్తల్లోకి ఎక్కింది. అంతరిక్షంలోకి వెళ్లిన తొలి తెలుగు మహిళగా రికార్టు సాధించింది. వర్జిన్‌ గెలాక్టిక్‌ సంస్థ వ్యవస్థాపకుడు రిచర్డ్‌ బ్రాన్సన్‌, మరో నలుగురితో కలిసి ఆదివారం రోదసిలోకి ఆమె వెళ్లొచ్చింది. కేవలం గంటల వ్యవధిలోనేఈ ప్రయోగం ముగిసింది. భూమిపై నుంచి విమానంలో మొదట ఆకాశంలోకి వెళ్లడం.. అక్కడ నుంచి స్పేస్‌ ఫ్లైట్‌లో రోదసిలోకి వెళ్లడం.. అక్కడ భార రహిత స్థితిని అనుభవించి మళ్లీ భూమికి రావడం.. ఇదంతా కేవలం కొన్ని నిమిషాల్లోనే జరిగిపోయిందంటోంది శిరీష.


ఆమె తన అంతరిక్ష యాత్ర అనుభవాలు పంచుకుంది. అంతరిక్షం నుంచి భూమిని వీక్షించడం అద్భుతమైన, జీవితాంతం గుర్తుండిపోయే అద్భుత అనుభవం అంటోంది శిరీష. ఆమె ఇంకా ఏమంటోందంటే.. " నాకు ఇంకా అక్కడే ఉన్నట్లుగా అనిపిస్తోంది. అక్కడి నుంచి భూమికి తిరిగిరావడం భలేగా ఉంది. ఈ పర్యటన అనుభూతిని వర్ణించడానికి అద్భుతం కన్నా మంచి పదం ఏదీ నాకు తట్టడం లేదు. అంతరిక్షం నుంచి భూమిని చూడటం..  వ్యోమనౌక రాకెట్‌ మోటారు మంటలు ఎగసిపడటం.. అనేవి నా జీవితాన్ని మార్చేసే అనుభూతులుగా చెప్పొచ్చు. ఏదేమైనా రోదసిలోకి వెళ్లి, తిరిగిరావడం నా జీవితంలోనే మర్చిపోలేని అద్భుతమైన అనుభవం " అంటూ భావోద్వేగానికి లోనైందామె.


ఇది స్పేస్ టూరిజం కోసం చేపట్టిన ప్రాజెక్టు అంటున్న శిరీష.. భవిష్యత్‌లో అంతరిక్ష యాత్రల ధరలు మరింత తగ్గుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తోంది. వర్జన్ గెలాక్టిక్ యాత్ర సమయాలు తనకు ఉద్వేగభరిత క్షణాలని.. దీంతో చిన్ననాటి కల సాకారమైందని శిరీష అన్నారు. వ్యోమగామి కావాలన్నది తన చిన్ననాటి లక్ష్యమని.. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ ‘నాసా’ ద్వారా దాన్ని సాధించాలనుకున్నా సాధ్యపడలేదని.. అందుకే ఈ అసాధారణ మార్గాన్ని ఎంచుకున్నానని అంటోంది శిరీష. శిరీషకు దృష్టి సంబంధమైన సమస్య ఉంది. అందుకే ఆమె నాసాలో పైలట్‌ గానీ, వ్యోమగామి గానీ అవలేకపోయారు. ఆ లోటును ఇలా వర్జిన్‌ గెలాక్టిక్‌ యాత్రతో భర్తీ చేసుకున్నారు శిరీష.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: