మావోల శిబిరాల్లో కరోనా అలజడి రేపుతోంది. మావోయిస్టు కీలక నేత వినోద్ ఇకలేరు. కరోనా బారిన పడి కన్నుమూశారు. ఎన్ఐఏకి మోస్ట్‌వాంటెడ్‌గా ఉన్న వినోద్‌పై 15లక్షల రూపాయల రివార్డ్ కూడా ఉంది. ఒక ఎమ్మెల్యే మృతి వెనుక ఇతని హస్తం ఉందని అంటుంటారు. దండ కారణ్యంలో ప్రత్యేక జోల్ కమిటీ సభ్యుడిగా ఉన్న వినోద్.. కరోనాతో చనిపోయినట్టు కొత్త గూడెం జిల్లా పోలీసులు చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా పలు అనారోగ్య సమస్యలతో బాధపడి తుదిశ్వాస విడిచినట్టు చెబుతున్నారు. వినోద్ మాత్రమే కాదు కరోనా కాటుకు పలు మావోయిస్టు అగ్రనేతలు బలయ్యారు. ఉత్తర తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి నారాయణ అలియాస్ హరి భూషణ్ , ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు భారతక్క అలియాస్ సారక్క కోవిడ్ తో కన్నుమూశారు.
దండకారణ్యంలో మావోయిస్టులకు... పోలీసులకు మధ్య ఎప్పుడూ యుద్ధమే నడుస్తుంటుంది. ప్రభుత్వ విధానాలు నచ్చక మావోలు పలు విధ్వంసక కార్యక్రమాలకు పాల్పడుతుంటే.. లొంగిపోవాలని పోలీసులు పిలుపునిస్తుంటారు. అందులో భాగంగానే అటవీ ప్రాంతాల్లోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు పోలీసులపై తూటాల వర్షం కురిపిస్తారు మావోలు. పోలీసులు కూడా తామేం తక్కువ కాదంటూ తమ గన్ లకు పనిచెబుతారు. ఈ ఘర్షణలో మావోలతో పాటు పోలీసులు మృతి చెందిన ఘటనలున్నాయి. మరోవైపు ఈ ఇద్దరి మధ్య అమాయకులైన గిరిజనులు కూడా ప్రాణాలు కోల్పోతుంటారు.
చిక్కకుండా.. మొండిగా ఉంటూ.. మావో సైన్యాన్ని తయారు చేసుకొని.. ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నవ్యక్తులను పట్టుకునేందుకు పోలీసులు కొత్త ప్లాన్ లు వేస్తుంటారు. ఆ వ్యక్తి ఆచూకీ తెలిపినా.. పట్టి ఇచ్చినా 5లక్షలు, పదిలక్షలు.. అంటూ నజరానాలు కూడా పెడుతుంటారు. ఇలాంటి సందర్భంలో కొందరు పోలీసులకు డైరెక్ట్ గా లొంగిపోతారు. మరికొందరు మొండిగా తిరుగుతూ అనారోగ్యానికి గురై.. లేక వయోభారం మీదపడి మృతి చెందుతూ ఉంటారు. అయితే తాజాగా కరోనా అరణ్యంలో కూడా ప్రవేశం చేసింది. తాజాగా మావో ముఖ్యనేత వినోద్ ప్రాణం పీల్చేసింది. ఈ మధ్యకాలంలోనే మరో మావోయిస్టు అగ్రనేత హరిభూషణ్ మృతిచెందారు. మావోయిస్టులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలలో తన కార్యకలాపాలు కొనసాగిస్తూ వస్తున్నారు.