బాబోయ్.. అక్కడ రెచ్చిపోతున్న కరోనా.. రికార్డు స్థాయి మరణాలు..
అవును.. నిజమే.. రష్యాలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రష్యాలో కొత్తగా రికార్డుస్థాయిలో మళ్లీ 780 వరకూ కరోనా మరణాలు సంభవించాయి. కోవిడ్ మహమ్మారి మొదలైన నాటి నుంచి ఒక్క రోజులో నమోదైన మరణాల్లో ఇదే అత్యధికంగా అక్కడి నిపుణులు చెబుతున్నారు. మొదట్లో రష్యాలో తగ్గినట్టే కనిపించిన కరోనా కేసులు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి. కరోనాకు మొదట్లోనే టీకా తెచ్చిన దేశం రష్యా.
ఇక్కడ జూన్ మొదటి వారంలో 9 వేలుగా రోజువారీ కొత్త కేసుల ఉండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 20వేలు దాటిపోయింది. తాజాగా మరో 24 వేల 702 పాజిటివ్‌లు నమోదు అయ్యాయి. మరో 780మంది కోవిడ్ కాటుకు బలయ్యారు. రష్యాలో మొత్తం ఇప్పటివరకు దాదాపు 60 లక్షల మంది వైరస్ బారినపడడారు. ఇక కరోనా మరణాల విషయానికి వస్తే.. రష్యాలో ఇప్పటి వరకూ లక్షా 44వేల మంది కరోనాతో చనిపోయారు. డెల్టా వేరియంట్‌తోనే కరోనా కేసులు పెరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఈ కరోనా జోరుకు వ్యాక్సీన్ ద్వారానే అడ్డుకట్ట వేయవచ్చని నిపుణులు చెబుతున్నారు. రష్యాలో ప్రపంచంలో అన్ని దేశాల కంటే ముందుగానే వ్యాక్సిన్ వచ్చినా.. ప్రజలకు మాత్రం ఇంకా అందుబాటులోకి రాలేదు. రష్యాలో ప్పటి వరకు 18.5శాతం మంది మాత్రమే కనీసం ఒక డోసు టీకా తీసుకున్నారని లెక్కలు చెబుతున్నాయి. ఇతర పాశ్చాత్య దేశాలతో పోలిస్తే రష్యాలో టీకా పంపిణీ నెమ్మదిగానే ఉందని చెప్పాలి. మొత్తం రష్యా జనాభా 15 కోట్ల వరకూ ఉంటుంది. అందులో ఇంకా 20 శాతం మందికి కూడా వ్యాక్సీన్ అందలేదంటే ముప్పు ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు.