జాబ్ క్యాలెండర్.. జగన్ కంటే కేసీఆర్ కే ఎక్కువ సమస్యలు..

Deekshitha Reddy
ఇటీవల జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఏపీ సీఎం జగన్ ఎన్ని ఇబ్బందులు పడ్డారో చూస్తూనే ఉన్నాం. సచివాలయాల పోస్ట్ లు, వాలంటీర్ పోస్ట్ లతో ఖాళీలు భర్తీ చేసినా, ఏపీపీఎస్సీ పోస్ట్ ల విషయంలో నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందంటూ విద్యార్థి సంఘాలు రోడ్డెక్కాయి. ప్రతిపక్షాలు కూడా కలవడంతో ఆందోళనలు ఉధృతం అవుతున్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో కూడా జాబ్ క్యాలెండర్ తరహాలో ప్రతి ఏటా ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించారు సీఎం కేసీఆర్. తొలి విడతలో 56వేల ఖాళీలు చూపినా నిరుద్యోగులు శాంతించడంలేదు. డీఎస్సీ ఊసు లేకపోవడంతో మరోసారి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జాబ్ నోటిఫికేషన్లు ఎన్ని విడుదల చేసినా, డీఎస్సీ రిక్రూట్ మెంట్ చేపడితేనా నిరుద్యోగులు బాగా గుర్తుంచుకుంటారు. గతంలో ఉమ్మడి ఏపీలో ఆనాటి సీఎం వైఎస్ఆర్ విడుదల చేసిన మెగా డీఎస్సీ గురించి ఇప్పటి వరకూ చెప్పుకోడానికి అదే కారణం. ఆ తర్వాత ఆ స్థాయిలో ఎవరూ డీఎస్సీ ఖాళీలను భర్తీ చేయలేదు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన 56వేల పోస్టుల్లో కూడా ఉపాధ్యాయ ఖాళీలు నామమాత్రం. కేవలం 1384 ఖాళీలను మాత్రమే చూపడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్లతరబడి డీఎస్సీకోసం వేచి చూస్తున్న తమను మరోసారి మోసం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

విద్యార్థులు తక్కువ, ఉపాధ్యాయులు ఎక్కువ..
పాఠశాలల హేతుబద్ధీకరణ పేరుతో చాలాకాలంగా జరుగుతున్న ప్రక్రియను అటు ఉపాధ్యాయ సంగాలు, ఇటు నిరుద్యోగులు అడ్డుకుంటున్నారు. రోజు రోజుకీ ప్రభుత్వ పాఠశాలల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోవడంతో హేతుబద్ధీకరణ తప్పని పరిస్థితి. అంటే 30మంది విద్యార్థులకు ఒక టీచర్ లెక్కన పాఠశాలల్ని సర్దుబాటు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ తెలంగాణలో ప్రతి 18మంది విద్యార్థులకు ఒక టీచర్ ఉన్నారు. అంటే సగానికి సగం మంది ఉపాధ్యాయులు అదనంగా పనిచేస్తున్నట్టే లెక్క. తాజాగా కేంద్ర విద్యాశాఖ సైతం తెలంగాణలో ఎలిమెంటరీ విద్యలో 9221మంది ఉపాధ్యాయులు అదనంగా ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. మరోవైపు అవసరం ఉన్నచోట విద్యావాలంటీర్లతో పని జరుగుతోంది. ఈ దశలో కొత్తగా 56వేల పోస్ట్ లకు నోటిఫికేషన్లు ఇవ్వడానికి సిద్ధపడిన కేసీఆర్ సర్కారు, ఉపాధ్యాయ పోస్ట్ లను అందులో చూపించలేదు. దీంతో డీఎస్సీపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ప్రభుత్వ నిర్ణయాన్ని నిరుద్యోగ సంఘాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఉపాధ్యాయ ఖాళీలను చూపించకపోతే విద్యాశాఖ కార్యాలయాన్ని ముట్టడిస్తామని తెలంగాణ రాష్ట్ర డీఎడ్, బీఎడ్ అభ్యర్థుల సంఘం హెచ్చరించింది. జాబ్ క్యాలెండర్ పేరుతో ఏపీ సీఎం జగన్ ఇబ్బందులు పడుతున్నట్టే, అక్కడ తెలంగాణ సీఎంకి కూడా తలనొప్పి మొదలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: