పవన్‌ అసెంబ్లీ ఎంట్రీ లేనట్లేనా?

M N Amaleswara rao
పవన్ కల్యాణ్ వచ్చే ఎన్నికల్లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి..అసెంబ్లీలో అడుగుపెడతారా? అంటే జనసేన కార్యకర్తలు, పవన్ కల్యాణ్ అభిమానులు ఖచ్చితంగా అవుననే చెబుతారు. ఎందుకంటే గత ఎన్నికల్లోనే పవన్ గెలిచి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎంట్రీ ఇవ్వాల్సింది, కానీ ఊహించని విధంగా పవన్ ఓటమి పాలయ్యారని, ఈ సారి మాత్రం ఖచ్చితంగా గెలుస్తారని జనసైనికులు చెబుతున్నారు.

అయితే పవన్ గెలుస్తారనే కాన్ఫిడెన్స్ జనసైనికులకు ఉంది గానీ, క్షేత్ర స్థాయిలో పవన్ గెలవడానికి ఎలాంటి సన్నాహాలు చేస్తున్నారంటే చెప్పడం కష్టం. ఎందుకంటే జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ నియోజకవర్గంపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ రాలేదు. మళ్ళీ పవన్ గాజువాక, భీమవరం నియోజకవర్గాల్లో పోటీ చేస్తారా? లేక వేరే నియోజకవర్గంలో పోటీ చేస్తారా? అనే అంశంపై జనసేనలో కన్ఫ్యూజన్ ఉన్నట్లు కనిపిస్తోంది. గాజువాక, భీమవరం స్థానాల్లోనే పవన్ మళ్ళీ పోటీ చేయొచ్చని కొందరు జనసేన కార్యకర్తలు భావిస్తున్నారు.

కాదు ఈసారి పవన్ నియోజకవర్గాన్ని మారుస్తున్నారని, గతంలో ప్రజారాజ్యం తరుపున చిరంజీవి పోటీ చేసి గెలిచిన తిరుపతి అసెంబ్లీ నుంచి పవన్ బరిలో ఉంటారని చెబుతున్నారు. కానీ వాస్తవ పరిస్తితుల్లోకి వస్తే పవన్ నెక్స్ట్ ఎక్కడ పోటీ చేస్తారనే విషయంపై ఏ మాత్రం క్లారిటీ లేదు. అదే సమయంలో పవన్ ఇప్పటినుంచే నియోజకవర్గాన్ని ఎంచుకుని, అక్కడ పార్టీని బలోపేతం చేసుకోపోతే, మళ్ళీ ఆయనకు గెలుపు దక్కడం కష్టమని, అసెంబ్లీలో అడుగుపెట్టే ఛాన్స్ మళ్ళీ దక్కదని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే గత ఎన్నికలతో పోలిస్తే ఇప్పుడు జనసేన ఇంకా వీక్ అయిందని, పార్టీని పవన్ ఏ మాత్రం బలోపేతం చేసినట్లు కనిపించడం లేదని, పైగా పవన్ కూడా మళ్ళీ ఎప్పటిలాగానే అప్పుడప్పుడు రాజకీయాలు చేస్తున్నారని, దీని వల్ల జనసేనకు చాలా ఇబ్బందులు వస్తాయని చెబుతున్నారు. ఇప్పటినుంచైనా పార్టీని బలోపేతం చేసే దిశగా పవన్ పనిచేయాలని, అన్నీ నియోజకవర్గాల్లో నాయకులని పెట్టుకుని పనిచేయాలని, అలాగే తన నియోజకవర్గం కూడా డిసైడ్ అయ్యి హార్డ్‌వర్క్ చేస్తే మంచి ఫలితం ఉంటుందని, లేదంటే అంతే సంగతులు అంటున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: