ఇకపై రైతులకు నెలకు రూ.1000 !

NAGARJUNA NAKKA
కరోనా.. దేశంలో అన్నదాతలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది.  ఈ కారణంగా రాజస్థాన్ ప్రభుత్వం రైతులకు చేయూతనిచ్చే ఓ వినూత్న పథకం తీసుకొచ్చింది. కిసాన్ మిత్ర యోజన పేరుతో కర్షకులకు నెలకు రూ.1000 అందించే పథకాన్ని ఆ రాష్ట్ర సీఎం అశోక్ గెహ్లాట్ ప్రారంభించారు. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్న అన్నదాతలకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున..  గరిష్టంగా అయితే రూ.12వేలు అందిస్తామని వెల్లడించారు. ఈ పథకానికి ఏటా రూ.1,450కోట్లు ఖర్చు చేయనున్నట్టు ప్రకటించారు.  

కరోనా వైరస్.. రైతులను ఇబ్బందులకు గురిచేసింది. లాక్ డౌన్ కారణంగా.. ఆరుగాలం పండించిన పంటలకు సరైన ఆదాయం రాక అన్నదాతలు కుంగిపోయారు. ఆర్థిక సమస్యల్లో చిక్కుకొని విలవిలలాడిపోయారు. ఇలాంటి సందర్భంలో రైతుల బాధలను అర్థం చేసుకున్న రాజస్థాన్ ప్రభుత్వం వారి ఆదుకునేందుకు ముందుకొచ్చింది. కర్షకుల కన్నీటి బిందువులు తుడిచేందుకు సిద్ధమైంది.

రైతుల సంక్షేమంపై తాము ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నట్టు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ వెల్లడించారు.  ఈ పథకం ద్వారా సాధారణ రైతులు లబ్ధి పొందనున్నారు. నెల నెలా నేరుగా రైతు ఖాతాల్లోనే ఈ వెయ్యి రూపాయలు జమ కానున్నాయి. ఈ సంవత్సరం మే నుండి ఈ ప్రక్రియ మొదలు కానుంది. దాదాపు 15లక్షల మంది రైతులు ఈ ప్రయోజనం పొందనున్నారు. గతంలో వసుంధర రాజే సీఎంగా ఉన్నప్పుడు సైతం.. ఇలాంటి సంక్షేమ కార్యక్రమమే తీసుకొచ్చారు.

వ్యవసాయంలో విద్యుత్ కనెక్షన్లు ఉన్న రైతులకు రూ.833 ఇచ్చేవారు. ఇపుడు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రస్తుత సీఎం దాన్ని వెయ్యి రూపాయలకు పెంచారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేర్చారు. మొత్తానికి రాజస్థాన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చేది వెయ్యి రూపాయలే అయినా అది  తమకు ఎంతో ఉపయోగపడనుందని అంటున్నారు. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: