తిరుమలలో అలాంటి వారికి నో ఎంట్రీ..

Deekshitha Reddy
మీరు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తున్నారా..? మీ వెంట తీసుకెళ్తున్న లగేజ్ లో ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయా..? అయితే మీకు నో ఎంట్రీ. తిరుమల వెళ్లేవారు కచ్చితంగా ప్లాస్టిక్ బాటిళ్లను అలిపిరి వద్దే వదిలేయాలి. లేకపోతే వారికి కొండపైకి ఎంట్రీ ఉండదని తేల్చి చెబుతున్నారు అధికారులు.

తిరుమలపై ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని గతంలోనే నిషేధించినా ఆ ఉత్తర్వులు పూర్తి స్థాయిలో అమలులోకి రాలేదు. అయితే దీనిపై టీటీడీ అధికారులు మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్నమయ్య భవన్ లో టీటీడీ ఏఈవో ధర్మారెడ్డి నిర్వహించిన సమీక్షలో ఈమేరకు ప్లాస్టిక్ బాటిళ్లను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. తిరుమల పవిత్రతను, స్వచ్ఛతను కాపాడేందుకు ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించామని, భక్తులు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లను ఎవరూ కొండపైకి తీసుకు రావద్దని విజ్ఞప్తి చేశారు.

తిరుమల కొండపైకి వచ్చే వాహనాలను అలిపిరి చెక్ పోస్ట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేస్తారు. కాలినడకన వెళ్లేవారి లగేజీలను కూడా అక్కడే చెక్ చేసి పంపిస్తారు. వాటిలో గుట్కా, ఖైనీ, మాంసాహారం, మద్యం ఏవీ లేకుండా తనిఖీ చేస్తారు. ఇకపై వాటితోపాటు ప్లాస్టిక్ బాటిళ్లను కూడా వెదుకుతారనమాట. ఇకపై అందరూ గాజు లేదా కాపర్ వాటర్ బాటిల్స్ ని మాత్రమై కొండపైకి తీసుకెళ్లే అవకాశం ఉంది. పసిబిడ్డల పాలు ఇతర అవసరాలకోసం మాత్రమే ప్లాస్టిక్ బాటిళ్లను కొండపైకి తీసుకెళ్లే అవకాశం ఉంది.

తిరుమల కొండపై కూడా ఇకపై ప్లాస్టిక్ బాటిళ్లలో మంచినీరు అమ్మరు. దీనిపై నిషేధం విధించారు. వీటికి ప్రత్యామ్నాయంగా గాజు, స్టీల్, కాపర్ బాటిళ్లలో మంచినీరు విక్రయిస్తారు. రాబోయే రెండు నెలల్లోగా తిరుమలలో పూర్తిగా ప్లాస్టిక్ నిర్మూలిస్తామని దీనికి భక్తులు, వ్యాపారులు సహకరించాలని కోరారు అధికారులు. భక్తుల అవసరార్థం అన్ని కాటేజీల్లో జలప్రసాదం స్వీకరించేందుకు స్టీల్ గ్లాసులు ఏర్పాటు చేశామని తెలిపారు అధికారులు. మొదట్లో అందరూ ఈ నియమాలను పాటించడం కష్టసాధ్యమే అయినా.. ప్లాస్టిక్ రహిత తిరుమల ఉద్యమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: