వామ్మో అక్కడ వరుసగా పిల్లుల మరణం.. ఎందుకంటే..?
హైదరాబాద్ మహానగర శివారు ప్రాంతంలోని గుండ్ల పోచం పల్లి ప్రాంతానికి చెందిన స్ప్లెండిడ్ అపర్ణ ఫామ్ హౌజ్ కమ్యూనిటీ ప్రాంతంలో ఇటీవల కాలంలో అనుకోని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఆ ఏరియాలోనే అనగా గేటెడ్ కమ్యూనిటీలో నివాసముంటున్న అనిత పీటర్స్, అనిషా చౌదరీ ఆ ప్రాంతంలో మూగ జీవులను బలి ఇవ్వడాన్ని గమనించారు. గత కొద్ది రోజులుగా ఆ గేటెడ్ కమ్యూనిటీలోని విల్లా నెంబర్ 132 సమీపంలో పిల్లులు చనిపోయి ఉండటాన్ని పలు మార్లు చూశారు. అయితే, అవి సాధారణంగానే మరణించినవేమో అనుకున్నారు. కానీ, వాటిని క్షుణ్ణంగా పరిశీలిస్తే వాటిని ఎవరో కొట్టి చంపినట్లుగా అనుమానమొచ్చింది. తీవ్రంగా గాయపరిచి తాళ్లతో బంధించి హింసాత్మకంగా కొట్టి చంపినట్లు అనిపించి భయపడిపోయారు. ఈ మేరకు విషయాలన్నీ పోలీసులకు తెలుపుతూ పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే పుండూరుకు చెందిన ప్రభుత్వ వెటర్నరీ వైద్యులు చనిపోయిన పిల్లుల మృతదేహాలను పోస్టు మార్టం చేశారు. నివేదిక రావాల్సి ఉంది. క్షుద్ర పూజల నేపథ్యంలో పిల్లులను బలి ఇస్తున్నారనే ప్రచారం స్థానికంగా ఉంది. కాగా, ఎందుకని మూగ జీవాలను వరుసగా చంపుతున్నారు? అనేది తెలియాల్సి ఉంది. డాక్టర్స్ పోస్టు మార్టం రిపోర్టును బట్టి పిల్లుల మరణం సహజసిద్ధమా? కాదా? అనేది తేలుతుంది. ఆ తర్వాత పోలీసులు ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చూడాలి మరి.