తెలుగు రాష్ట్రాల్లో వరద ఉగ్రరూపం..!

NAGARJUNA NAKKA
మరో మూడు రోజులు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. దీంతో అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం పలు జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించింది. అసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. అటు ఏపీలో తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం జిల్లాల్లో ఈ రోజు భారీ వర్షాలు పడొచ్చని హెచ్చరించారు. దీంతో జగన్ ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది.
గోదావరి నదిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తివేయడంతో భద్రాచలం దగ్గర నీటి ఉద్ధృతి పెరుగుతోంది. ఉదయం 6గంటలకు నీటి మట్టం 19.4అడుగులకు చేరింది. వరద మరింత పెరిగే అవకాశముందని, నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పోలవరం దగ్గర ప్రవాహం పెరుగుతోంది. అటు ఉత్తర తెలంగాణలోని శ్రీరాం సాగర్, కడెం జలాశయాల నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టుకు 8.40లక్షల క్యూసెక్కుల భారీ వరద వస్తోంది.
ప్రశాంతతకు మారు పేరు నిర్మల్ పట్టణం. ఇక్కడి ప్రజలకు వరద అనేదే తెలియదు. కానీ గత మూడు రోజులుగా కురిసిన కుండపోత వర్షానికి వాగులు పొంగిపొర్లడంతో నిర్మల్ నీట మునిగింది. పట్టణం గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి. నాలాలను ఆక్రమించేసి లే అవుట్లు, ఇళ్లు కట్టడంతో వాటిపై ఒత్తిడి పెరిగింది. ఫలితంగా వరద నీరంతా కాలనీల్లోకి చేరింది. జీఎన్ ఆర్ కాలనీలో అయితే మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చాయి.
ఇక కొమురం భీం జిల్లాను వరద అతలాకుతలం చేస్తోంది. వరద ఉద్ధృతికి పెద్దవాగు ఉప్పొంగడంతో 9మంది నీటిలోనే చిక్కుకున్నారు. వీరంతా స్థానికంగా బ్రిడ్జ్ పనుల కోసం వెళ్లిన కార్మికులుగా గుర్తించారు. వీరిని కాపాడేందుకు సహాయక చర్యలు చేపట్టిన అధికారులు.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించారు.  
ఏపీలోనూ భారీ వర్షాలు కురుస్తుండటంతో చెరువులు, కుంటలు నిండిపోయాయి. ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు వస్తుండటంతో అధికారులు మూడు గేట్లు ఎత్తి 18వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 44.03టీఎంసీల నీరు ఉండగా.. జలాశయం పూర్తి సామర్థ్యం 45.77టీఎంసీలు. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: