హెచ్చరిక : ముంపు ముంచుకొస్తోంది జాగ్రత్త..!

NAGARJUNA NAKKA
పోలవరం దగ్గర గోదావరి నది ఉద్ధృతి పెరగడంతో ముంపు మండలాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. బోట్లు, మోటార్ బోట్లు, స్టీమర్లలో నదిలో ప్రయాణించవద్దని.. నదిలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. అత్యవసర సహాయం కోసం తూర్పుగోదావరి జిల్లా చింతూరులో రెండు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, వి.ఆర్.పురంలో ఒక బృందం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్ట్ 48గేట్ల ద్వారా 8.6లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. కాఫర్ డ్యామ్ దగ్గర నీటి మట్టం 34.3మీటర్లకు చేరింది. రాజమండ్రి ధవళేశ్వరం బ్యారీజీ దగ్గర నీటి మట్టం 10.4అడుగులకు చేరింది. 8.2లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. అటు కృష్ణానదిపై ఉన్న శ్రీశైలం ప్రాజెక్టుకు 3.78లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తోంది.

ఇక గోదావరి నదిలో వరద ఉద్ధృతి కొనసాగడంతో ధవళేశ్వరం దగ్గర మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ధవళేశ్వరం దగ్గర ఔట్ ఫ్లో 10లక్షల 8వేల 685క్యుసెక్కులుగా ఉండగా.. అధికారులను విపత్తుల శాఖ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

మరోవైపు ఎగువ నుంచి వరద రాకపోవడంతో గోదావరి నదిపై ఉన్న శ్రీరాం సాగర్ ప్రాజెక్టు మెయిన్ గేట్లను అధికారులు మూసివేశారు. ఎస్కేప్ గేట్ల ద్వారా 8వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. రెండు రోజులు వర్షాలు లేకపోవడంతో వరద తగ్గింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 1091అడుగులు కాగా ప్రస్తుతం 1089.9అడుగులు ఉంది. గరిష్ఠ నీటినిల్వ సామర్థ్యం 90టీెంసీలు కాగా ప్రస్తుతం 82.21టీఎంసీలు నీరు ఉంది.

తెలంగాణలోకి పశ్చిమ గాలులు వీస్తున్నందున.. నేటి నుంచి మూడు రోజుల పాటు పలు చోట్ల తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 28న ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. ఏపీలో పశ్చిమగాలులు, అల్పపీడన ప్రభావంతో రానున్న 48గంటల్లో కోస్తా, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఈదురు గాలులతో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయంది.

 







 



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: