అశోక్‌ గజపతిరాజు పిటిషన్‌పై విచారణ వాయిదా

N.Hari
కేంద్ర మాజీ మంత్రి, మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌ అశోక్‌ గజపతిరాజు పిటీషన్‌పై హైకోర్టు లో‌ విచారణ జరిగింది. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా తన ఆదేశాలను ఈఓ అమలు చేయడం లేదని అశోక్‌ గజపతిరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యవహారంపై విచారించి తగిన ఆదేశాలు ఇవ్వాలని ఆయన కోర్టుకు విన్నవించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కౌంటర్‌ దాఖలు చేయడానికి సమయం కావాలని రాష్ట్ర ప్రభుత్వ తరఫు న్యాయవాది కోరారు. మరోవైపు అశోక్‌ గజపతిరాజు తరఫున సీనియర్‌ న్యాయవాదులు డి.వి.సీతారామ్మూర్తి, అశ్వనీకుమార్‌లు వాదనలు వినిపించారు. కోర్టు కొట్టేసిన జీవోలను అమలు చేయడంపై అశోక్‌ గజపతిరాజు తరఫు లాయర్‌లు అభ్యంతరం వ్యక్తం చేశారు. కౌంటర్‌ దాఖలుకు సమయం కావాలన్న ప్రభుత్వం తరఫు న్యాయవాది విజ్ఞప్తితో... దీనిపై విచారణను మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు.
మరోవైపు మాన్సాస్‌ ట్రెస్టులో వరుసగా జరుగుతున్న పరిణామాలు విజయనగరం రాజవంశాన్ని రాజకీయ చౌరస్తాలో నిలబెట్టాయన్న చర్చ జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక తీసుకువచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుతో మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోక గజపతిరాజుని కాదని, సంచయితను నియమించారు. దీనిపై అశోక గజపతిరాజు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం.. అశోక గజపతిరాజుకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో మాన్సాస్‌ ట్రస్ట్‌ ఛైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు మళ్లీ బాధ్యతలు చేపట్టారు. అయితే ఈ పరిణామాన్ని సంచయిత జీర్ణించుకోలేదని, అధికార వైసీపీ అండతో ఆమె మాన్సాస్‌ ట్రస్టు అధికారులను తన గుప్పెట్లోకి తీసుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే మాన్సాస్ ట్రస్ట్‌ చైర్మన్‌గా అశోక్‌ గజపతిరాజు ఆదేశాలను ఈవో అమలు చేయడం లేదట. ఈ క్రమంలోనే అశోక్‌ గజపతిరాజు మరోసారి కోర్టును ఆశ్రయించారు. మాన్సాస్‌ ట్రస్ట్‌ చైర్మన్‌గా తన ఆదేశాలను పాటించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును ఆయన అభ్యర్థించారు. అయితే ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారన్న కోణంలో కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని సమాచారం. మరి అశోక్‌ గజపతిరాజు తాజాపిటిషన్‌పై హైకోర్టు ఎలాంటి ఆదేశాలు వెలువరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: