స్టాలిన్ కఠిన నిర్ణయం.. తమిళనాడులో లాక్ డౌన్ పొడిగింపు

Deekshitha Reddy
తమిళనాడు సీఎం స్టాలిన్ కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఆగస్ట్ 9 వరకు లాక్ డౌన్ పొడిగిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం తమిళనాడులో కూడా రోజువారీ కేసుల్లో స్వల్ప పెరుగుదల కనిపిస్తోంది. మరోవైపు కేరళతో సరిహద్దుల్ని పంచుకుంటున్న ఆ రాష్ట్రం కరోనా థర్డ్ వేవ్ విషయంలో మరింత భయపడుతోంది. దీంతో లాక్ డౌన్ పొడిగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది.
దేశవ్యాప్తంగా లాక్ డౌన్ సడలింపులు ఉన్నా.. తమిళనాడులో మాత్రం ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈనెల 31తో లాక్ డౌన్ ఆంక్షలు ముగిసిపోతాయని పూర్తిస్థాయిలో సడలింపులు ఉంటాయని ప్రజలు ఆశించారు. అయితే కేరళలో కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు అప్రమత్తమైంది. అక్కడ కూడా లాక్ డౌన్ పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
ప్రస్తుతం తమిళనాడులో రాత్రి 8గంటల వరకు మాత్రమే షాపులు తెరిచేందుకు అనుమతి ఉంది. ఈ వెసులుబాటుని మాత్రం మరో గంటపాటు పొడిగించారు. ఆ తర్వాత జనసంచారానికి అనుమతి లేదని తేల్చి చెప్పారు. ఇక తమిళనాడులో సినిమా హాళ్లు, బార్లు ఇప్పటికే మూతబడి ఉన్నాయి. వాటిపై ఆంక్షల్ని ఆగస్ట్ 9 వరకు కొనసాగించబోతున్నారు. స్కూళ్లు, కాలేజీలకూ కూడా అనుమతి ఇవ్వలేదు. స్విమ్మింగ్ పూల్స్, రాజకీయ పార్టీల మీటింగ్ లు, సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలపై కూడా నిషేధం కొనసాగుతోంది. ఐటీ కంపెనీలు మాత్రం 50శాతం సిబ్బందితో కార్యకలాపాలు కొనసాగించొచ్చు.
తమిళనాడులో ప్రజా రవాణాపై కూడా ఆంక్షల్ని కొనసాగించేందుకు సీఎం స్టాలిన్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం 50శాతం ఆక్యుపెన్సీతో అక్కడ బస్సులు తిరుగుతున్నాయి. ఆగస్ట్ 9వరకు అదే నియమం అమలులో ఉంటుంది. జిల్లాల మధ్య తిరిగే బస్సుల్లో రద్దీ ఉండకూడదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలొచ్చాయి. కేరళ సరిహద్దుల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులను ఆదేశించారు. తమిళనాడు తాజా నిర్ణయంతో ఇతర దక్షిణాది రాష్ట్రాలు కూడా ఆలోచనలో పడ్డాయి. ఇప్పటికే ఏపీలో నైట్ కర్ఫ్యూ పొడిగించారు. కేరళలో వీకెండ్ కర్ఫ్యూ అమలవుతోంది. తెలంగాణలో మాత్రం పూర్తి స్థాయి వెసులుబాటు అమలులో ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: