షాకిస్తున్న దళిత బంధు.. మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యేకి రాజీనామా డిమాండ్?

praveen
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ప్రజలందరినీ ఆకర్షించి ఓట్లు సాధించేందుకు టిఆర్ఎస్ అధినేత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో వ్యూహాలు పన్నుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో పథకాలను కూడా ప్రవేశ పెడుతున్నారు. దీంట్లో భాగంగానే దళిత బందు అనే పథకాన్ని తీసుకొచ్చి సంచలనమే సృష్టించారు కేసీఆర్. అంతే కాదు కేవలం హుజురాబాద్ ఎన్నికల కోసమే పార్టీకి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే దళిత బంధు పథకాన్ని తీసుకు వచ్చాము అంటూ డైరెక్టుగానే మీడియా ముందు చెప్పేశారు.  దీంతో ఇక ఎన్నో రోజుల నుంచి దళిత బంధు పథకం కాస్త తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. దళిత బంధు పథకం తో పాటు ప్రస్తుతం హుజురాబాద్ అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తోంది ప్రభుత్వం.



 దీంతో ఈటెల పదవిలో ఉన్నప్పుడు కానీ అభివృద్ధి.. రాని పథకాలు ఇక ఇప్పుడు రాజీనామా చేసిన తర్వాత వస్తున్నాయని అందరూ అనుకుంటున్నారు . దీంతో ఇక మిగితా టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రాజీనామా చేయాలని అలా జరిగితేనే నియోజకవర్గ అభివృద్ధి జరుగుతుందని ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా డిమాండ్లు వస్తున్నాయి. ఇలా కెసిఆర్ తీసుకొచ్చిన దళిత బంధు పథకం అటు కేసీఆర్ కి పెద్ద తలనొప్పిగా మారుతోంది. ఇటీవలే మరో టిఆర్ఎస్ ఎమ్మెల్యే కు షాక్ తగిలింది. వెంటనే రాజీనామా చేయాలి అంటూ డిమాండ్లు ఒక్కసారిగా తెరమీదకు వచ్చాయి. కోదాడ టిఆర్ఎస్ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యకు దళిత బంధు గట్టి షాక్ ఇచ్చింది.



 కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ వెంటనే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి అంటూ దళిత సంఘాల నేతలు అందరూ ఆందోళన చేయడం మొదలుపెట్టారు. ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తే తమకు కూడా దళిత బంధు వస్తుంది అంటూ చెబుతున్నారు  దళిత సంఘాల నేతలు. అదే సమయంలో ఇక దళిత సంఘాలకు సంఘీభావంగా అటు బీజేపీ నేతలు కూడా మద్దతు పలుకుతూ ర్యాలీలో పాల్గొనడం గమనార్హం. ఇలా ఒక నియోజకవర్గంలోనే కాదు అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి డిమాండ్లు తెర మీదకు వస్తున్నాయి. దీంతో రానున్న రోజుల్లో ఇంకా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది హాట్ టాపిక్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: