స్కూళ్లకు వ్యతిరేకంగా టీడీపీ పోరుబాట..
ఇతర రాష్ట్రాల్లో కొవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ స్కూళ్లు తిరిగి మొదలవుతున్నాయి. ఈ దశలో ఏపీ కూడా స్కూళ్లు తెరిచేందుకు నిర్ణయం తీసుకుంది. టెన్త్ విద్యార్థులకు గ్రేడ్లు కేటాయించే కసరత్తు పూర్తి కావడంతో ఇంటర్ కాలేజీలపై కూడా స్పష్టత వచ్చినట్టయింది. ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తెరిచేందుకు విద్యాశాఖ కసరత్తులు పూర్తి చేసింది. మరోవైపు నాడు-నేడు ఫస్ట్ ఫేజ్ పనుల్ని కూడా ప్రజలకు అంకితం చేస్తారు, సెకండ్ ఫేజ్ పనులకు లాంఛనంగా శ్రీకారం చుడతారు.
థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో ప్రస్తుతం ఏపీలో స్కూల్స్ తెరిచే పరిస్థితి ఉందా లేదా అనేది అనుమానంగా మారింది. ఈ దశలో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ.. స్కూల్స్ తెరిచే నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గతంలో కూడా పదో తరగతి, ఇంటర్ పరీక్షల రద్దుకోసం టీడీపీ పోరాటం చేసిన సంగతి తెలిసిందే. నారా లోకేష్ ఆధ్వర్యంలో జూమ్ కాన్ఫరెన్స్ లు కూడా చాలానే జరిగాయి. ఎట్టకేలకు ప్రభుత్వం పరీక్షల్ని రద్దుచేసి ఆల్ పాస్ అనేసింది. ఇప్పుడు కూడా అలాగే స్కూళ్లను తిరిగి తెరిచే విషయంలో మరికొన్నిరోజులు వేచి చూడాలని సూచిస్తోంది ప్రతిపక్ష టీడీపీ.
ఆగస్ట్ 16నుంచి స్కూల్స్ తెరిచేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా.. పరిస్థితుల్ని బట్టి తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే కేరళలో కేసులు పెరిగాయి, తమిళనాడులో ఆంక్షలు పెంచారు. ఏపీలో మాత్రం నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. మరో 2 నెలలపాటు అప్రమత్తంగా ఉండాలని సీఎం జగన్ సూచించిన సందర్భంలో.. స్కూళ్లను తిరిగి తెరిచే విషయంలో కూడా ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.