జగన్.. వాళ్లపై కోపం సరే.. ఈ తప్పులకు బాధ్యులెవరు..?
ప్రతిరోజూ ఈ విషయాలు పతాక శీర్షికలకు ఎక్కుతున్నాయి. ఇలాంటి వాటిని ఎల్లో మీడియా దాడిగా జగన్ సర్కారు చెప్పుకుని కాలం వెల్లబుచ్చవచ్చేమో కానీ.. ఎన్నాళ్లు ఇలా దాటవేతతో లాక్కొస్తారన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు ఇలాంటి అడ్డగోలు వ్యవహారం మీడియాకు ఎక్కడానికి అసలు కారణం ఆర్థిక శాఖలోని ఉద్యోగులే అంటూ కొందరిపై సస్పెన్షన్ వేటు వేయడం కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వం గుట్టు పత్రికలకు ఇస్తున్నారన్న కారణంతో వారిపై వేటు వేశారు.
అయితే.. ఉద్యోగులపై వేటు వేస్తారు సరే.. జరిగిన ఉల్లంఘనల మాటేమిటి.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రజల ఆందోళన మాటేమిటి.. రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా రుణాలు సేకరించడం వివాదాస్పదం అవుతోంది. చివరకు భవిష్యత్తు ఆదాయాలను కూడా తాకట్టు పెట్టారన్న అంశం మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఉద్యోగుల ప్రభుత్వ ద్రోహం సరే.. కానీ.. వాళ్లు బయటపెట్టినవన్నీ నిజాలేగా.. ఆ నిజాల సంగతేంటి..?
గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు.. ఇప్పుడు జగన్ సర్కారు ఉద్యోగులపై వేటు వేసింది. పరోక్షంగా ఏపీ ఆర్థిక శాఖలో అడ్డగోలు వ్యవహారం సాగుతోందని అంగీకరించినట్టైంది. ఇప్పటికైనా జగన్ సర్కారు ఎవరిపైనో కోపం వెళ్లగక్కడం కాకుండా ఇంటి పరిస్థితి చక్కదిద్దుకోవాలి. అప్పుల వ్యవహారంపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. అంతా సవ్యంగానే ఉందనే భరోసా ఇవ్వగలగాలి. అది వదిలేసి ఉద్యోగులపై కోపం తీర్చుకోవడం ద్వారా సాధించేదేమీ ఉండదు. మరి ఇకనైనా జగన్ సర్కారు దిద్దుబాటు దిశగా అడుగులు వేస్తుందా.. లేదా.. మేమే రైటు అన్నట్టు మొండిగా వ్యవహారిస్తుందా.. చూడాలి..