తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికయిన ఎంపీ రేవంత్ రెడ్డికి ఆదిలోనే కఠిన సవాల్ ఎదురైంది. మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో హుజురాబాద్ నియోజకవర్గంలో ఉప ఎన్నికకు తెర లేచింది. దీనితో ఈ ఎన్నికతో రేవంత్ రెడ్డి కఠిన సవాలును ఎదుర్కోనున్నాడు. అసలుకే పార్టీలో అసంతృప్తుల జ్వాలలు రేగుతుంటే, వాటిపై తన దృష్టిని సారించాలా లేదా త్వరలో జరగబోయే హుజురాబాద్ ఎన్నికలపై ప్రణాళిక రచించాలా అనే సందిగ్ధంలో పడ్డారు. ఒక వైపు ఇప్పటికే అధికార తెరాస మరియు బీజేపీ లు హోరా హోరీగా ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు.
కేసీఆర్ ఈ నియోజకవర్గంలో దళితులు అధికంగా ఉన్నందు వలన ముందుగానే వారికీ దళిత బంధు పథకాన్ని ప్రవేశ పెట్టి వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అన్ని కులాల వారిని సంతృప్తి పరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలని దానిపై రేవంత్ రెడ్డి ఒక స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ కార్యకర్తలలో సరికొత్త జోష్ వచ్చినట్లయింది. రేవంత్ రెడ్డి తెరాసను తన విమర్శలతో పరుగులెత్తిస్తున్నారు. ఇక్కడ హుజురాబాద్ లోని దళిత ఓటర్లను ఆకట్టుకోవడానికి దళిత నాయకుడినే ఎన్నికల బరిలో దించడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది.
గెలుపు ఓటమిల సంగతి పక్కన పెడితే కనీసం బీజేపీ తెరాస లకు ప్రత్యామ్నాయంగా మేమున్నామని తెలిచేయాలని చూస్తోంది. మరి ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా లేదా చూడాలి. కాగా ఇప్పటికే దామోదర రాజ నర్సింహా హుజురాబాద్ నియోజకవర్గంలో అందరినీ కలుపుకుని పోతూ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తన వంతు కృషి చేస్తున్నారు. మరి ఏమి జరగనుందో చూడాలి. రేవంత్ రెడ్డి కొత్త వ్యూహంతో తెరాస మరియు బీజేపీలకు షాక్ ఇస్తాడా చూడాలి.