ఆ వైసీపీ ఎంపీ కూడా టీడీపీ ఖాతాలోకేనా... వైసీపీ వాళ్లు ఆశలు వదులుకున్నట్టే ?
గత 2019 ఎన్నికల్లో ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్‌పై విజయందక్కించుకున్న మాగుం ట శ్రీనివాసులు రెడ్డిని కూడా టీడీపీ తనవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తోందని.. వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికి ప్రధానంగా రెండు కారణాలను వైసీపీ నేతలు చూపిస్తున్నారు. ఒకటి.. మాగుంట ఇటీవల పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీలో ఎంపీలకు విందు ఇచ్చారు. దీనికి వైసీపీ ఎంపీలను ఆహ్వానించాల్సి న ఆయన.. వీరితోపాటు.. టీడీపీకి చెందిన నేతలను కూడా ఆహ్వానించారు. ఇదే విషయం వైసీపీలో తీవ్ర రచ్చకు దారితీసింది. నిజానికి టీడీపీతో సై అంటూ.. కాలు దువ్వుతున్న సమయంలో ఇలాంటి పరిణామాలు ఏంటని.. వైసీపీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే.. మాగుంటమాత్రం దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఇదిలావుంటే, ఇప్పుడు మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. అక్రమ గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి ఏకంగా వైసీపీ ఎంపీ మాగుంటకు క్లీన్ చిట్ ఇచ్చారు. వాస్తవానికి సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ గ్రావెల్ తవ్వకాలకు సంబంధించి.. పోలీసులు నమోదు చేసిన కేసులో ఎంపీ మాగుంటను ఏ2గా చేర్చారు. అయితే.. దీనిపై సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మాగుంట అమాయకుడని, ఆయన పేరును అక్రమంగా ఇరికించారని.. .దీనిని తొలగించాలని సోమిరెడ్డి డిమాండ్ చేయడం.. దీనిపై ఏకంగా సీఎం జగన్‌కే లేఖ రాయడం.. వైసీపీ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.